Sakshi Premier League 2023: ఫైనల్లో ఎస్‌ఆర్‌ఆర్, గౌతమ్‌ కాలేజీ జట్లు

28 Feb, 2023 04:53 IST|Sakshi

ఘట్‌కేసర్‌: తెలంగాణ రాష్ట్ర స్థాయి సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీ జూనియర్‌ విభాగంలో ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజి (మంచిర్యాల), గౌతమ్‌ జూనియర్‌ కాలేజి (ఈసీఐఎల్‌) జట్లు టైటిల్‌ పోరుకు అర్హత సాధించాయి. సీనియర్‌ విభాగంలో వాగ్దేవి డిగ్రీ కాలేజి (మంచిర్యాల), భవాన్స్‌ వివేకానంద డిగ్రీ కాలేజి (సైనిక్‌పురి) జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఫైనల్స్‌ నేడు జరుగుతాయి. మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం ప్రతాప సింగారంలోని బాబురావు సాగర్‌ మైదానంలో ఈ టోర్నీ జరుగుతోంది.

సోమవారం జరిగిన జూనియర్‌ విభాగం తొలి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజి తొమ్మిది వికెట్లతో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజి (వరంగల్‌)పై గెలిచింది. ముందుగా పాలిటెక్నిక్‌ కాలేజి 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. అనంతరం ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజి 7.2 ఓవర్లలో ఒక  వికెట్‌ కోల్పోయి 89 పరుగులు చేసి గెలుపొందింది. ఎస్‌ఆర్‌ఆర్‌ ప్లేయర్‌ కృష్ణతేజ 25 బంతుల్లో 52 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ గౌతమ్‌ జూనియర్‌ కాలేజి 67 పరుగుల తేడాతో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజి (వరంగల్‌)ను ఓడించింది.

ముందుగా గౌతమ్‌ కాలేజి 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. అన్విత్‌ రెడ్డి 16 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అనంతరం పాలిటెక్నిక్‌ కాలేజి 10 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 52 పరుగులకే పరిమితమై ఓడిపోయింది.   సీనియర్‌ విభాగం తొలి మ్యాచ్‌లో వాగ్దేవి డిగ్రీ కాలేజి ఎనిమిది వికెట్లతో ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కాలేజి (ఖమ్మం)పై నెగ్గింది. ముందుగా ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ కాలేజి 10 ఓవర్లలో 9 వికెట్లకు 74 పరుగులు చేయగా... వాగ్దేవి కాలేజి 6 ఓవర్లలో 2 వికెట్లకు 75 పరుగులు చేసి గెలిచింది.

సాయి 16 బంతుల్లో 38 పరుగులు చేశాడు. సీనియర్‌ విభాగం రెండో మ్యాచ్‌లో భవాన్స్‌ వివేకానంద డిగ్రీ కాలేజి ఐదు వికెట్లతో ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ కాలేజిని ఓడించింది. మొదట ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ జట్టు 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. అనంతరం భవాన్స్‌ వివేకానంద కాలేజి 6.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసి గెలుపొందింది. భవాన్స్‌ ప్లేయర్‌ కృతిక్‌ 17 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. 

మరిన్ని వార్తలు