Michael Jordan: బాస్‌ ఆఫ్‌ బాస్కెట్‌బాల్‌

23 Apr, 2023 14:08 IST|Sakshi

అచీవర్స్‌

ఆరు సార్లు ప్రతిష్ఠాత్మక నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ) టైటిల్‌ గెలిచిన జట్టులో సభ్యుడు... ఆరు ఫైనల్స్‌లో అత్యంత విలువైన ఆటగాడి అవార్డు... ఐదు సార్లు టోర్నీ మొత్తంలో అత్యంత విలువైన ఆటగాడు...14 సీజన్ల పాటు ఆల్‌స్టార్‌ జట్టులో చోటు...రెండు ఒలింపిక్‌ పతకాలు...కనీసం రెండంకెల పాయింట్లు స్కోరు చేసిన వరుస మ్యాచ్‌లు ఏకంగా 840... ఒక మ్యాచ్‌లో ఒంటిచేత్తో ఏకంగా 69 పాయింట్లు సాధించిన ఘనత... ఒకటేమిటి, ఇలా ఆ దిగ్గజం గొప్పతనం గురించి చెప్పుకుంటూ పోతే పుటలు సరిపోవు.

లెక్కలేనన్ని రికార్డులను అతను తిరగరాశాడు. అతను కోర్టులో అడుగుపెడితే అభిమానులకు అతి పెద్ద పండుగ! ఆట మొదలుపెడితే అద్భుతాలు ఆవిష్కృతం కావడమే, లోకం ఊగిపోవడమే! క్రీడా చరిత్రలో ఒక ఆటపై ఒక వ్యక్తి ఇంతగా తనదైన ముద్ర వేయడం అరుదు. ఆ సూపర్‌ స్టార్‌ పేరే మైకేల్‌ జోర్డాన్‌. మరో మాటలకు తావు లేకుండా ఆల్‌టైమ్‌ గ్రేట్‌. ఒక తరం పాటు బాస్కెట్‌బాల్‌ అంటే జోర్డాన్‌; జోర్డాన్‌ అంటే బాస్కెట్‌బాల్‌!

1984లో ఎన్‌బీఏ జట్టు షికాగో బుల్స్‌ తొలి సారి జోర్డాన్‌ను తీసుకుంది. అప్పుడు వారికీ తెలీదు. తాము ఎలాంటి సంచలనాన్ని ఎంచుకున్నామో, మున్ముందు అతను చూపే అద్భుతాలు ఎలాంటివో వారూ ఊహించలేదు. సీనియర్లు మెల్లమెల్లగా తప్పుకుంటున్న దశలో జోర్డాన్‌ రాక బుల్స్‌ టీమ్‌ను శాశ్వత కీర్తిని తెచ్చిపెట్టింది. అతను పాయింట్‌ సాధించే క్రమంలో ఎగిరే తీరు, ’స్లామ్‌ డంక్స్‌’తో పాటు ‘ఫ్రీ త్రో లైన్‌’లో పాయింట్లు సాధించే తీరు ప్రపంచ క్రీడాభిమానులందరూ నివ్వెరపోయేలా చేశాయి.

అందుకే జోర్డాన్‌ కోసం వారంతా పడిచచ్చిపోవడం మొదలైంది. బుల్స్‌తో చేరిన తర్వాత తొలి ఎన్‌బీఏ టైటిల్‌ సాధించేందుకు కొంత సమయం పట్టినా తన అద్భుత ఆటతో బుల్స్‌కు రెండుసార్లు త్రీ–పీట్‌ (హ్యాట్రిక్‌) టైటిల్స్‌ను అందించాడు. 1991–93 వరకు వరుసగా మూడేళ్లు షికాగో బుల్స్‌ పైచేయి సాధించిందంటే అందుకు జోర్డానే కారణం. అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించిన మూడేళ్ల తర్వాత తిరిగొచ్చిన జోర్డాన్‌... మరోసారి వరుసగా మూడేళ్లు బుల్స్‌ టైటిల్‌ సాధించడంలో మళ్లీ ప్రధాన పాత్ర పోషించడం విశేషం. ఎన్‌బీఏ లీగ్‌ చరిత్రలో తొలి బిలియనీర్‌ ప్లేయర్‌గా అతను గుర్తింపు పొందాడు. 

స్కూల్, కాలేజీల్లో సత్తా చాటి...
జోర్డాన్‌ జీవితంలో పెద్దగా ఎత్తుపల్లాలేమీ లేవు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అతని బాల్యం బాగానే సాగింది. ఆటల్లో ఎంతో ఆసక్తి కనబర్చిన అతను తన స్కూల్‌లో బాస్కెట్‌బాల్, బేస్‌బాల్, ఫుట్‌బాల్‌ ఆడాడు. బాస్కెట్‌బాల్‌ అతడిని ఎక్కువగా ఆకర్షించడంతో జట్టులో చోటు కోసం ప్రయత్నించాడు. ఆ సమయంలో జోర్డాన్‌ ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు. మామూలుగా అయితే ఇది మంచి ఎత్తు. కానీ స్కూల్‌ లెవల్‌ బాస్కెట్‌బాల్‌ ఆడేందుకు ఇది సరిపోదని, చాలా తక్కువ అంటూ అతడికి చోటు నిరాకరించారు! దాంతో అదే స్కూల్‌ జూనియర్‌ టీమ్‌ తరఫున అతను ఆడాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ సత్తా చాటి పాయింట్ల వర్షం కురిపించాడు.

తర్వాతి ఏడాది వచ్చేసరికి జోర్డాన్‌ ఎత్తు మరో 10 సెంటీమీటర్లు పెరిగింది. దాంతో పాటు శిక్షణలో కఠోరంగా శ్రమించాడు కూడా. ఫలితంగా తిరస్కరించిన జట్టులోనే చోటు లభించింది. తమ టీమ్‌ను వరుసగా గెలిపించడంతో పాటు అమెరికాలోని ప్రతిష్ఠాత్మక బాస్కెట్‌బాల్‌ స్కాలర్‌షిప్‌లన్నీ వచ్చి చేరాయి. ఆపై కాలేజీ టీమ్‌లో కూడా చెలరేగడంతో కాలేజీ బాస్కెట్‌బాల్‌ అమెరికన్‌ టీమ్‌లో కూడా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. జాగ్రఫీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసే సమయానికే బాస్కెట్‌బాల్‌లో జోర్డాన్‌ అందరి దృష్టిలో పడి భవిష్యత్‌ సూపర్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. నిజంగానే ఆ తర్వాత ఎదురు లేకుండా అతని ప్రస్థానం కొనసాగింది. 

తిరుగులేని ప్రదర్శనతో...
షికాగో బుల్స్‌... ఎన్‌బీఏలో 1966నుంచి బరిలో ఉన్న జట్టు. 18 సీజన్ల పాటు ఆడినా ప్రదర్శన అంతంతమాత్రంగా ఉంది. కానీ 1984 డ్రాఫ్ట్‌ ఆ జట్టుకు ఒక్కసారిగా ఆకర్షణను తెచ్చింది. దానికి కారణం ఒకే ఒక్కడు మైకేల్‌ జోర్డాన్‌. జోర్డాన్‌ బరిలోకి దిగితే చాలు అభిమానులు ఊగిపోయారు. ఫలితంతో సంబంధం లేకుండా అతను ఉంటే చాలు, అతని ఆట చూస్తే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఆ ఏడాది బుల్స్‌ ఆడిన 82 మ్యాచ్‌లు అన్నింటిలో బరిలోకి దిగిన ఏకైక ఆటగాడైన జోర్డాన్‌ ప్రతీ గేమ్‌కు సగటున 28.2 పాయింట్లు సాధించిన శిఖరాన నిలిచాడు.

అయితే ఇతర సహచరుల నుంచి తగినంత సహకారం లేక టీమ్‌ ప్రస్థానం పడుతూ లేస్తూ సాగింది. కానీ 1991లో ఎట్టకేలకు బుల్స్‌ ఎదురు చూసిన క్షణం వచ్చింది. ఫైనల్లో టాప్‌ టీమ్‌ లాస్‌ ఏంజెల్స్‌ లేకర్స్‌ను ఓడించి బుల్స్‌ తొలి సారి చాంపియన్‌గా నిలిచింది. 31.5 సగటు పాయింట్లతో టాప్‌ స్కోర్‌ సాధించిన జోర్డాన్‌ అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత వరుసగా రెండేళ్లు ఇదే కొనసాగింది. ఫలితంగా మరో రెండు టైటిల్స్‌ జట్టు ఖాతాలో చేరాయి. 

అనూహ్యంగా దూరమై...
1993లో జోర్డాన్‌ తండ్రి అనూహ్యంగా హత్యకు గురయ్యాడు. తండ్రిని ఎంతో ప్రేమించిన జోర్డాన్‌ తనకు బాస్కెట్‌బాల్‌పై ఆసక్తి తగ్గిపోయిందంటూ హఠాత్తుగా రిటైర్మెంట్‌ నిర్ణయం ప్రకటించాడు. బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌గా అప్పటికే ఎంతో కీర్తిని పొందినా, చిన్నప్పుడు తన తండ్రి తనను బేస్‌బాల్‌ ఆటగాడిగా చూడాలని కోరుకున్నాడంటూ ఒక్కసారిగా బేస్‌బాల్‌ మైనర్‌ లీగ్‌లో కూడా అడుగు పెట్టాడు. అక్కడ రెండు సీజన్ల పాటు బ్యారన్స్, స్కార్పియన్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే రెండేళ్ల తర్వాత తన టీమ్‌ బుల్స్‌ పరిస్థితి బాగా లేకపోవడంతో సీజన్‌ మధ్యలో ’ఐయామ్‌ బ్యాక్‌’ అంటూ రిటైర్మెంట్‌కు గుడ్‌బై చెప్పిన మళ్లీ కోర్టులోకి అడుగు పెట్టాడు.

సుమారు 18 నెలల పాటు ఆట నుంచి దూరంగా ఉన్నా జోర్డాన్‌లో ఏమాత్రం పదును తగ్గలేదు. ఒంటి చేతుల్లో టీమ్‌ను ప్లే ఆఫ్‌ వరకు చేర్చగలిగాడు. అయితే తాను చేయాల్సింది ఇంకా ఉందని భావించిన జోర్డాన్‌ తర్వాతి సీజన్‌ కోసం సీరియస్‌గా కష్టపడ్డాడు. అందుకు తగ్గ ఫలితం కూడా జట్టుకు లభించింది. మరో సారి వరుసగా మూడేళ్ల పాటు (1996, 97, 98) బుల్స్‌ ఎన్‌బీఏ చాంపియన్‌గా నిలవడం విశేషం.

రెండోసారి మళ్లీ రిటైర్మెంట్‌ ప్రకటించి, మూడేళ్ల తర్వాత జోర్డాన్‌ మళ్లీ వెనక్కి వచ్చాడు. ఈసారి జట్టు మారి రెండేళ్ల పాటు వాషింగ్టన్‌ విజార్డ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. జోర్డాన్‌ టీమ్‌ నుంచి తప్పుకున్న తర్వాత 1998నుంచి ఇప్పటి వరకు ఎన్‌బీఏలో షికాగో బుల్స్‌ మరో టైటిల్‌ గెలవలేకపోయిందంటే అతని ఘనత ఏమిటో అర్థమవుతుంది. 1984 లాస్‌ ఏంజెల్స్, 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లలో అమెరికాకు స్వర్ణ పతకాలు అందించి జాతీయ జట్టు తరఫున కూడా తన బాధ్యతను నెరవేర్చాడు. 
 
 బాస్కెట్‌బాల్‌కు ప్రపంచవ్యాప్తంగా అమిత ప్రాచుర్యం కల్పించడంలో జోర్డాన్‌ కీలక పాత్ర పోషించాడు. అతని కారణంగానే 90వ దశలో ఎన్‌బీఏ లీగ్‌ వాణిజ్యపరంగా ఎంతో ఎత్తుకు ఎదిగింది. స్వయంగా జోర్డాన్‌ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా మార్కెట్‌ను శాసించాడు. అతనితో ఒప్పందాల కోసం పెద్ద పెద్ద సంస్థలు ‘క్యూ’ కట్టి పోటీ పడ్డాయి. ప్రపంచ క్రీడా చరిత్రలో అత్యధికంగా మార్కెటింగ్‌ చేయబడిన ఆటగాడిగా అతను గుర్తింపు పొందారు.

అన్నింటికి మించి ‘నైకీ’ సంస్థ అతని జంప్‌తో ప్రత్యేకంగా రూపొందించిన షూస్‌ విశ్వవ్యాప్తంగా సంచలనం సష్టించాయి. ‘ఎయిర్‌ జోర్డాన్‌’ పేరుతో రూపొందించిన ఈ కమర్షియల్‌తో అతని స్థాయి ఏమిటో తెలిసింది. పలు సినిమాలు, డాక్యుమెంటరీల్లో కూడా నటించిన జోర్డాన్‌ పలు పుస్తకాలు రచించాడు. అయితే ’ఫర్‌ ద లవ్‌ ఆఫ్‌ ద గేమ్‌’ పేరుతో వచ్చిన జోర్డాన్‌ ఆత్మకథలో అతని కెరీర్, జీవితంలో అన్ని కోణాలు కనిపిస్తాయి.

మరిన్ని వార్తలు