‘వంద’లు లెక్కించడం కొత్త కాదు..కోహ్లికి ఈ ‘వంద’ మాత్రం ప్రత్యేకమైందే

2 Mar, 2022 01:49 IST|Sakshi

కెరీర్‌లో 100వ టెస్టు ఆడనున్న కోహ్లి

ఈ ఘనత సాధించనున్న 12వ 

భారత క్రికెటర్‌గా గుర్తింపు

విరాట్‌ కోహ్లికి ‘వంద’లు లెక్కించడం కొత్త కాదు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏడు పదుల శతకాలు బాదిన ఈ దిగ్గజం కెరీర్‌లో ప్రతీ ‘వంద’ ప్రత్యేకమైందే. కానీ ఈ సారి అతను సాధించబోయే ‘సెంచరీ’కి విశేష స్థానం ఉంది. ఆరంభంలో పరిమిత ఓవర్ల ఆటగాడిగానే గుర్తింపు తెచ్చుకొని మూడేళ్ల తర్వాత గానీ తొలి టెస్టు అవకాశం రాని కోహ్లి ఇప్పుడు 100 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకుంటున్నాడు. వన్డేలు, టి20ల్లో అత్యద్భుత రికార్డులు, అసాధారణ ఘనతలు ఉన్నా... నాకు టెస్టులంటేనే ఇష్టమంటూ ఢంకా బజాయించి చెప్పిన ఈ కాలపు అరుదైన బ్యాటర్‌ అతను. ‘భారత్‌కు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించడం గొప్ప అదృష్టం’ అంటూ సంప్రదాయ శైలి ఆటకు పతాకధారిగా మారిన కోహ్లి... మాటలతో మాత్రమే కాకుండా తన బ్యాటింగ్‌తోనూ సమకాలీకుల్లో మేటిగా నిలిచాడు. అందమైన కవర్‌డ్రైవ్‌తో ఆకట్టుకునే బ్యాటింగ్‌ను చూపించినా... ఎలాగైనా గెలవాలనే కసితో ప్రత్యర్థిపై ఆవేశాన్ని ప్రదర్శించేందుకు వెనుకాడని తత్వమైనా అది కోహ్లికే చెల్లింది.


శ్రీలంకతో జరిగే తొలి టెస్టుతో శుక్రవారం కోహ్లి తన కెరీర్‌లో వందో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న వేళ కొన్ని విశేషాలు... 

అలా మొదలైంది... 
2008లో అండర్‌–19 ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలిపిన కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి టి20, వన్డే టీమ్‌కు తొందరగానే ఎంపికయ్యాడు. అయితే దిగ్గజాలతో నిండిన టెస్టు టీమ్‌లో అవకాశం దక్కించుకునేందుకు అతను ఎదురు చూడాల్సి వచ్చింది. కెరీర్‌లో 59 వన్డేలు ఆడిన తర్వాత కోహ్లి వెస్టిండీస్‌ గడ్డపై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్‌లో 5 ఇన్నింగ్స్‌లలో 76 పరుగులే చేసి అతను పేలవంగా ఆరంభించాడు. అయితే సొంతగడ్డపై ఆడిన తన నాలుగో టెస్టులో విండీస్‌పై రెండు ఇన్నింగ్స్‌లలో అర్ధ సెంచరీలతో అతని ఆటకు గుర్తింపు దక్కింది.   


మేలిమలుపు... 
ఆస్ట్రేలియా గడ్డపై 2011–12 సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లోనూ కోహ్లి విఫలమయ్యాడు. బౌన్సీ పిచ్‌లపై ఆడే విషయంలో అతని టెక్నిక్‌పైనా సందేహాలు రేగాయి. అయితే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అతనిపై నమ్మకముంచి మూడో టెస్టులోనూ అవ కాశం కల్పించింది. పెర్త్‌లో జరిగిన ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి తానేంటో చూపించాడు. చక్కటి బ్యాక్‌ఫుట్‌ షాట్లతో 75 పరుగులు చేసి సత్తా చాటాడు. ఆపై మరింత మెరుగైన ప్రదర్శన కనబ రుస్తూ అడిలైడ్‌లో జరిగిన నాలుగో టెస్టులో విరాట్‌ సెంచరీ సాధించాడు. భారత్‌ 0–4తో చిత్తుగా ఓడిన సిరీస్‌లో మన జట్టు తరఫున నమోదైన ఏకైక సెంచరీ ఇదే కావడం కోహ్లి విలువను చాటింది.  

ఆ రెండూ సూపర్‌... 
సచిన్‌ రిటైరయ్యాక 2013 చివర్లో దక్షిణాఫ్రికాపై జొహన్నెస్‌బర్గ్‌ టెస్టులో తొలిసారి కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఈ మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌లలోనూ 119, 96 పరుగులతో చెలరేగిన అతను సచిన్‌ స్థానంలో ఆడేందుకు తానే సరైనవాడినని రుజువు చేసుకొని ‘నంబర్‌ 4’ను ఖాయం చేసుకున్నాడు. మరో రెండు నెలల తర్వాత వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌పై చేసిన 105 పరుగులు కూడా కోహ్లి ఎక్కడైనా ఆడగలడని రుజువు చేశాయి.  

చేదు జ్ఞాపకం... 
విరాట్‌ అద్భుత కెరీర్‌లో ఎప్పటికీ మరకగా ఉండిపోయే సిరీస్‌ ఏదైనా ఉందంటే అది 2014 ఇంగ్లండ్‌ టూర్‌. విపరీతంగా స్వింగ్‌ అవుతున్న ‘డ్యూక్‌’ బంతులతో అండర్సన్‌ స్థాయి బౌలర్‌ను ఎదుర్కోలేక కోహ్లి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 10 ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 134 పరుగులే చేయడం అతని పేలవ టెక్నిక్‌కు అద్దం పట్టింది. అయితే పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లుగా తర్వాతి పర్యటనలో కోహ్లి తన బ్యాటింగ్‌తో అదే ఇంగ్లండ్‌ గడ్డపై అదరగొట్టాడు. 2018లో 10 ఇన్నింగ్స్‌లలో 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలతో 593 పరుగులు తన వాడిని ప్రదర్శించిన కోహ్లి ఒక్కసారి కూడా అండర్సన్‌కు అవుట్‌ కాలేదు!  

హైలైట్‌ ప్రదర్శన 
టెస్టు క్రికెటర్‌గా కోహ్లిని గుర్తు చేసుకోవాలంటే 2014–15 ఆస్ట్రేలియా పర్యటనలో అతని ఆట చాలు. ధోని గైర్హాజరులో అడిలైడ్‌లో తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి రెండు ఇన్నింగ్స్‌లలో 115, 141 పరుగులు చేశాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగులను ఛేదించే క్రమంలో దూకుడు కనబరుస్తూ జట్టును విజయానికి చేరువగా తెచ్చాడు. 48 పరుగులతో భారత్‌ ఓడినా... జాన్సన్‌ పై అతను విరుచుకుపడిన తీరు, ఎలాగైనా గెలవాలనే కసితో ఆడిన శైలి ఎప్పటికీ గుర్తుండి పోతుంది.  

సారథిగా అదరగొట్టే ఆట 
టెస్టు కెప్టెన్‌గా కోహ్లి ఎన్నో రికా ర్డులు నెలకొల్పాడు. 68 టెస్టుల్లో నాయకత్వం వహిస్తే అందులో 40 విజయాలు, 17 పరాజయాలు (విజయశాతం 58.82) మాత్రమే ఉన్నాయి. అయితే కెప్టెన్‌గా ఉన్నప్పుడు అతని ఆట మరింత ఎత్తుకు ఎదిగింది. సారథి కాని సమయంలో కోహ్లి బ్యాటింగ్‌ సగటు 41.13 కాగా... కెప్టెన్సీలో అది 54.80 కావడం అతనిపై ఎలాంటి నాయకత్వ భారం లేదని స్పష్టం చేసింది. కోహ్లి ఏకంగా 7 డబుల్‌ సెంచరీలతో ఏ కెప్టెన్‌కూ అందనంత ఎత్తులో నిలిచాడు.


99 టెస్టుల్లో కోహ్లి 50.39 
సగటుతో 7,962 పరుగులు 
చేశాడు. ఇందులో 27 
సెంచరీలు, 28 అర్ధ 
సెంచరీలు ఉన్నాయి.  

 

మరిన్ని వార్తలు