Quinton de Kock: విదేశీ లీగ్‌ల కోసం రెండేసి నెలలు దూరంగా ఉన్నా పర్లేదు.. కానీ.. టెస్టులు ఆడరా: పాక్‌ మాజీ కెప్టెన్‌

31 Dec, 2021 19:03 IST|Sakshi

దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ తీరుపై పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌ విమర్శల వర్షం కురిపించాడు. లీగ్‌ మ్యాచ్‌ల కోసం నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉండొచ్చు కానీ... దేశం కోసం ఆడలేవా అంటూ మండిపడ్డాడు. కాగా సెంచూరియన్‌లో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ప్రొటిస్‌ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 113 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.

ఈ క్రమంలో తాను టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు డికాక్‌. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించేందుకే రిటైర్మెంట్‌ తీసుకున్నట్లు 29 ఏళ్ల డికాక్‌ వెల్లడించాడు. ఈ నేపథ్యంలో డికాక్‌ ఆకస్మిక నిర్ణయం పట్ల సల్మాన్‌ భట్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా స్పందించాడు. ఇలాంటి నిర్ణయాలు సెలక్షన్‌ పాలసీ, కెప్టెన్‌ మైండ్‌సెట్‌ను ప్రభావితం చేస్తాయని విమర్శించాడు.

ఈ మేరకు.. ‘‘ గత ఏడాదిన్నర కాలంగా క్వింటన్‌ డికాక్‌ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. కెప్టెన్‌గా పాకిస్తాన్‌కు వచ్చాడు. ఆ తర్వాత ఆ బాధ్యతల్లో కొనసాగలేకపోయాడు. ఇప్పుడేమో ఒక టెస్టు ఆడిన తర్వాత రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇలాంటి ఆలోచనా విధానం, ప్రకటనలు జట్టులోని వాతావరణాన్ని నాశనం చేస్తాయి. సమతౌల్యాన్ని దెబ్బతీస్తాయి’’ అని అభిప్రాయపడ్డాడు.

ఇక ఇటీవల కాలంలో రిటైర్మెంట్‌ డ్రామా ఎక్కువైందన్న సల్మాన్‌ భట్‌... ‘‘అకస్మాత్తుగా ఆటకు వీడ్కోలు పలకడం ఇటీవల ఫ్యాషన్‌ అయిపోయింది. విదేశీ లీగ్‌లలో ఆడేందుకు రెండేసి నెలల పాటు కుటుంబాలకు దూరంగా ఉన్నపుడు ఎలాంటి సమస్యలు ఎదురుకావడం లేదా? టెస్టు క్రికెట్‌ విషయంలో మాత్రమే ఇలా ఎందుకు? దేశం కోసం ఆడుతున్నపుడే అన్నీ గుర్తుకువస్తాయి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

‘‘కొంతమంది లీగ్‌ క్రికెట్‌ ఆడితే సరిపోతుంది అనుకుంటున్నారు. టెస్టులతో పనిలేదు అని భావిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెటర్లకు ఉండాల్సిన లక్షణం కాదిది. డికాక్‌ రిటైర్మెంట్‌ గురించి ఇంతకంటే మంచిగా మాట్లాడటం నా వల్ల కాదు’’ అంటూ సల్మాన్‌ క్రికెటర్ల తీరును విమర్శించాడు.  

చదవండి: అన్ని ఫార్మాట్లలోనూ రోహిత్‌ ‘హిట్‌’... అశూ, అక్షర్‌ కూడా అద్భుతం!

మరిన్ని వార్తలు