సలాం సాహా.. నిజమైన ప్రొఫెషనలిజం చూపించావు

23 May, 2021 16:52 IST|Sakshi

లాహోర్‌: టీమిండియాకు ఫస్ట్‌ ఛాయిస్‌ వికెట్‌ కీపర్‌గా రిషబ్‌ పంతే ఉండాలని వ్యాఖ్యానించిన భారత వెటరన్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాపై పాక్‌ మాజీ ఆటగాడు సల్మాన్‌ బట్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇలాంటి వ్యాఖ్యలు నిజమైన ప్రొఫెషనల్‌ ఆటగాడు మాత్రమే చేయగలడని కితాబునిచ్చాడు. ప్రొఫెషనలిజం అనేది భారత వ్యవస్థలో భాగంగా మారిందని, అందుకు సాహా చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని కొనియాడాడు. మన స్థానంలో మరొకరికి అవకాశాలు వస్తున్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సాధారణమైన విషయం కాదని, అందుకే సాహాను నిజమైన ప్రొఫెషనల్‌ ఆటగాడితో పోల్చానని పేర్కొన్నాడు.

వ్యక్తిగత స్వార్ధాలు పక్కన పెట్టి దేశ ప్రయోజనాల గురించి ఆలోచించిన సాహాకు హ్యాట్సాఫ్‌ అని ఆకాశానికెత్తాడు. ఈ సందర్భంగా సాహాతో అతనికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. వీరిద్దరు ఐపీఎల్‌ ప్రారంభ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. కాగా, ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇంగ్లండ్‌ పర్యటనకు భారత్‌ వికెట్‌గా ఎవరు బెస్ట్‌ ఛాయిస్‌ అనే అంశంపై మాట్లాడుతూ.. సాహా పై విధంగా స్పందించాడు.

ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్షిప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌ల్లో పంత్‌ విశేషంగా రాణించాడు కాబట్టి ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లే భారత జట్టుకు అతనే మొదటి ఛాయిస్‌గా ఉండేందుకు అర్హుడని పేర్కొన్నాడు. తన అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటానని, అంతవరకు ప్రాక్టీస్‌పై దృష్టి సారిస్తానని వెల్లడించాడు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో డబ్యూటీసీ ఫైనల్‌, ఇంగ్లండ్‌తో 5 టెస్ట్‌ల సిరీస్‌ ఆడేందుకు భారత జట్టు జూన్‌ 2న ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది. భారత జంబో జట్టులో వికెట్‌ కీపర్లుగా పంత్‌, సాహాలు ఎంపికైనప్పటికీ.. కరోనా బారిన పడటంతో సాహా అవకాశాలు క్లిష్టంగా మారాయి. 
చదవండి: సెప్టెంబ‌ర్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు.. ఈ నెల 29న ప్రకటించే అవకాశం

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు