రిస్క్‌ తగ్గించుకుంటే మంచిది.. లేకుంటే కష్టమే

20 May, 2021 15:38 IST|Sakshi

ఢిల్లీ: టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షాలో స్థిరత్వం లోపించిందని.. అందుకే అతను జట్టుకు ఎంపిక కాలేకపోతున్నాడంటూ పాకిస్తాన్‌ మాజీ ఓపెనర్‌ సల్మాన్‌ భట్‌ పేర్కొన్నాడు. ఒక యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో భట్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

''పృథ్వీ షా ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే రిస్క్‌ తీసుకొని షాట్లు ఆడుతున్నాడు. ఇది అంత మంచిది కాదు. దీనివల్ల రానున్న టీ20 ప్రప‍ంచకప్‌కు పృథ్వీ ఎంపికయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. టీ20 అంటేనే దూకుడైన ఆటతీరు ప్రదర్శించాలనేది ​ప్రథమం. కానీ పృథ్వీ షా ఆరంభంలోనే రిస్క్‌ షాట్లు ఎక్కువగా ఆడుతున్నాడు. దీనివల్ల తొందరగా వికెట్‌ కోల్పోయే అవకాశం ఉంది. ప్రతీసారి దూకుడుగా ఆడడం కూడా కరెక్ట్‌ కాదు. ఆడిన ప్రతీ బంతిని బౌండరీ బాదాలనుకోవడం అతనిలో స్థిరత్వం లేదని చూపిస్తుంది. ఏ జట్టైనా టీ20లో తొలి ఆరు ఓవర్లుగా చెప్పుకొనే పవర్‌ ప్లేలో స్థిరంగా ఆడే బ్యాట్స్‌మెన్‌ కావాలి. టీమిండియాకు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌ రూపంలో ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు పృథ్వీ షా వారి పక్కన స్థానం సంపాదించాలంటే ముందు స్థిరత్వం చూపించాలి. టీ20 ప్రపంచకప్‌ లాంటి మేజర్‌ టోర్నీలకు ఇది చాలా కీలకం. షా తన పద్దతి మార్చుకోకుండా ఇలాగే ఆడితే మాత్రం అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కడం కష్టమే'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక పృథ్వీ షా ఐపీఎల్‌ 14వ సీజన్‌లో మాత్రం దుమ్మురేపాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున 8 మ్యాచ్‌ల్లో 308 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ముఖ్యంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా 41 బంతుల్లోనే 82 పరుగులు సాధించాడు. అంతకముందు దేశవాలీ టోర్నీ అయిన విజయ్‌ హజారే ట్రోపీలో దుమ్మురేపాడు. నాలుగు సెంచరీలు సాధించి 800 పరుగులతో టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా నిలిచి తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు.
చదవండి: పృథ్వీ షా ముందు బరువు తగ్గు.. ఆ తర్వాత చూద్దాం!

పృథ్వీ షాకు చేదు అనుభవం.. అడ్డుకున్న పోలీసులు

మరిన్ని వార్తలు