4 ఏళ్ల నాటి సల్మాన్‌ ట్వీట్‌ వైరల్‌..

16 Oct, 2020 16:11 IST|Sakshi

ముంబై: ఐపీఎల్‌ సీజన్‌లో సుదీర్ఘ విరామం తర్వాత కింగ్స్‌ పంజాబ్‌ మరో గెలుపును ఖాతాలో వేసుకుంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా, ఆ మ్యాచ్‌ ఆఖరి బంతి వరకూ వెళ్లడంతో ఉత్కంఠ ఏర్పడింది. ‘పాపం.. పంజాబ్‌. మళ్లీ ఓడిపోతుందా’ అనిపించింది. చహల్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ ఓవర్‌లో కింగ్స్‌ పంజాబ్‌కు రెండు పరుగులు అవసరం కాగా, చహల్‌ తొలి నాలుగు బంతులకు పరుగు మాత్రమే ఇచ్చాడు. ఇక ఐదో బంతికి గేల్‌ రనౌట్‌ అయ్యాడు. దాంతో ఉత్కంఠ ఏర్పడింది. (కెప్టెన్సీకి దినేశ్‌ కార్తీక్‌ గుడ్‌ బై)

కానీ పూరన్‌ సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను ఫినిష్‌ చేయడంతో కింగ్స్‌ పంజాబ్‌ ఊపిరి పీల్చుకుంది. వరుస ఓటములతో ఢీలా పడ్డ కింగ్స్‌ పంజాబ్‌కు గేల్‌ ఓ మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తన మార్కు స్టైల్‌ ఆటతో పంజాబ్‌ ఊపిరి తీసుకునే విజయాన్ని అందించాడు. తొలుత నెమ్మదిగా ఆడిన గేల్‌ తర్వాత సిక్స్‌లతో మంచి జోష్‌ తీసుకొచ్చాడు. 45 బంతుల్లో   1 ఫోర్‌, 5 సిక్స్‌లతో 53 పరుగులు సాధించిన గేల్‌ తన విలువ ఏమిటో చూపించాడు. అతనికి జతగా కేఎల్‌ రాహుల్‌(61 నాటౌట్‌;  49 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్స్‌లు), మయాంక్‌ అగర్వాల్‌(45; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు)లు రాణించడంతో కింగ్స్‌ గెలిచింది. 

కాగా, కింగ్స్‌ పంజాబ్‌ గెలుపు తర్వాత నాలుగేళ్ల క్రితం బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.  2014లో కింగ్స్‌ పంజాబ్‌ ఫైనల్‌లో ఓడిపోవడంపై అప్పుడు సల్మాన్‌ ట్వీట్‌ చేశాడు. ‘ప్రీతి జింటా జట్టు గెలిచిందా.. ఏమిటి?’ అంటూ సరదాగా ట్వీట్‌ చేశాడు. అది ఇప్పుడు మరొకసారి వైరల్‌ అవుతోంది. నిన్న ఆర్సీబీతో మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ విజయం సాధించడంతో ఆనాటి సల్మాన్‌ ట్వీట్‌ను పంజాబ్‌ ఫ్యాన్స్‌ గుర్తు చేస్తున్నారు. ఇదిగో కింగ్స్‌ పంజాబ్‌ గెలిచింది సల్మాన్‌.. ఈ సీజన్‌లో ఆర్సీబీపై ఒకసారి కాదు.. రెండు సార్లు గెలిచింది పంజాబ్‌ ’ అంటూ సల్మాన్‌ ట్వీట్‌ను వైరల్‌ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

కేకేఆర్‌తో జరిగిన ఆనాటి ఫైనల్‌లో కింగ్స్‌ పోరాడి ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కింగ్స్‌ 199 పరుగులు చేయగా, దాన్ని కేకేఆర్‌ ఇంకా మూడు బంతులు ఉండగా ఛేదించి విజయం సాధించింది. అప్పుడు కేకేఆర్‌ జట్టులో ఉన్న మనీష్‌ పాండే 94 పరుగులు చేసి కేకేఆర్‌ ట్రోఫీ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, అప్పుడు ట్రోఫీ సాధించాలనుకున్న కింగ్స్‌ పంజాబ్‌ ఆశలు తీరలేదు. ఇప్పటివరకూ కింగ్స్‌ పంజాబ్‌ ఐపీఎల్‌ టైటిల్‌ను సాధించలేదు. ఆ జట్టుకు బాలీవుడ్‌ నటి ప్రీతిజింటా సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు.

>
Poll
Loading...
మరిన్ని వార్తలు