పాపం ఇలా అవుటవుతానని ఊహించి ఉండడు

26 Jun, 2021 11:37 IST|Sakshi

కార్డిఫ్‌: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్‌ బౌలర్‌ సామ్‌ కరన్‌ అద్భుత రనౌట్‌తో మెరిశాడు. ఫుట్‌బాల్‌ టెక్నిక్‌ను ఉపయోగిస్తూ లంక బ్యాట్స్‌మన్‌ దనుష్క గుణతిలకను వెనక్కి పంపడం వైరల్‌గా మారింది. టాస్‌ గెలిచిన శ్రీలంక ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, దనుష్క గుణతిలకలు ఆరంభించారు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో సామ్‌ కరన్‌ వేసిన మూడో బంతిని ఫెర్నాండో షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్‌కు తగిలి పిచ్‌పైనే ఉండిపోయింది.

సింగిల్‌కు అవకాశం ఉండడంతో నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న గుణతిలక ఫెర్నాండోకు కాల్‌ ఇచ్చాడు. అయితే అప్పటికే కరన్‌ అక్కడే ఉండడంతో రెప్పపాటులో ఫుట్‌బాల్‌ టెక్నిక్‌ను ఉపయోగించి తన కాలితో బంతిని వేగంగా వికెట్ల వైపు తన్నాడు. అంతే.. గుణతిలక క్రీజులోకి చేరుకోకుముందే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో ఇది ఊహించని గుణతిలక భారంగా పెవిలియన్‌కు చేరాడు. సామ్‌ కరన్‌ రనౌట్‌ వీడియో ఈసీబీ తన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ఇట్స్‌ కమింగ్‌ హోమ్‌..  సామ్‌ బ్యాక్‌ ఆన్‌ ది నెట్‌ అంటూ క్యాప్షన్‌ జత చేసింది. 

ఇక ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో శ్రీలంకపై గెలిచిన ఇంగ్లండ్‌ ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.  తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 111 పరుగులు చేసింది. కుశాల్‌ మెండిస్‌ (39; 3 ఫోర్లు, సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌ (2/18), ఆదిల్‌ రషీద్‌ (2/24) రాణించారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ సమయంలో వర్షం రావడంతో ఆ జట్టు లక్ష్యాన్ని 18 ఓవర్లలో 103 పరుగులుగా నిర్ణయించారు. ఇంగ్లండ్‌ 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి గెలి చింది. సామ్‌ బిల్లింగ్స్‌ (24; 2 ఫోర్లు), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లివింగ్‌స్టోన్‌ (26 బంతుల్లో 29 నాటౌట్‌; సిక్స్‌), సామ్‌ కరన్‌ (8 బంతుల్లో 16 నాటౌట్‌; ఫోర్, సిక్స్‌) రాణించి ఇంగ్లండ్‌ విజయాన్ని ఖాయం చేశారు. చివరిదైన మూడో టి20 మ్యాచ్‌ నేడు జరుగుతుంది.   

చదవండి: ఆల్‌రౌండ్‌ ప్రదర్శన.. ఇంగ్లండ్‌దే టి20 సిరీస్‌ 

మరిన్ని వార్తలు