మ్యాచ్‌లో ఓడినా.. మనసులు గెలిచావోయ్‌ కరన్‌!

29 Mar, 2021 09:00 IST|Sakshi

పుణే: ఆదివారం రసవత్తరంగా సాగిన ఆఖరి వన్డేలో ఏడు పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి భారత్‌ గెలిచినప్పటికీ, స్యామ్ కరన్ తన అసాధారణ బ్యాటింగ్‌ తో అందరి మనసులను గెలుచుకున్నాడు. మరో రకంగా చెప్పాలంటే మ్యాచ్‌లో ఓటమి తథ్యమనేలా కోహ్లి సేనని భయపెట్టాడు. స్యామ్‌ కరన్‌ ఐపీఎల్ 2020  ద్వారా భారత్‌ క్రికెట్ అభిమానులకి పరిచయమైన పేరు.


గత సీజన్‌ లో చెన్నై జట్టు తరుపున  ఓపెనర్‌గా, వన్‌డౌన్‌ గా బరిలోకి దిగి తన బ్యాట్‌తో మెరుపులు మెరిపించి భారత్‌లో తనకంటూ గుర్తింపు సంపాదించాడు. నిన్న జరిగిన సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌ ద్వారా భారత్ క్రికెట్‌ అభిమానుల గుండెల్లో ఒకింత గుబులు పుట్టించాడు. మరో ఎండ్ లో ధీటైన బ్యాట్స్‌మెన్‌ లేకపోయినా ధైర్యం కోల్పోకుండా తన భీకర బ్యాటింగ్‌తో‌ మ్యాచ్‌ను చివరి వరకు లాక్కొచ్చి తన కెరీర్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ను ఆడాడు.

భారత జట్టును భయపెట్టిన కరన్‌
స్యామ్‌ కరన్‌ (83 బంతుల్లో 95 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) పట్టుదలతో ఆడి ఎనిమిదో వికెట్‌కు ఆదిల్‌ రషీద్‌ (22 బంతుల్లో 19; 2 ఫోర్లు)తో 57 పరుగులు... తొమ్మిదో వికెట్‌కు మార్క్‌ వుడ్‌ (21 బంతుల్లో 14; ఫోర్‌)తో 60 పరుగులు జోడించి ఇంగ్లండ్‌ విజయం ఖాయమనేలా చేశాడు. భారత్‌కు సునాయాసంగా దక్కాల్సిన విజయాన్ని తీవ్రంగా శ్రమించి మ్యాచ్‌ని చివరి బంతివరకు తీసుకెళ్లాడు.

చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన పోరులో భారత్‌ నెగ్గినా... స్యామ్‌ కరన్‌ తన అసాధారణ పోరాటం తో అందరి మనసులు గెలుచుకున్నాడు. ఇంగ్లండ్‌ విజయానికి ఆఖరి ఓవర్లో 14 పరుగులు అవసరమయ్యాయి. భారత బౌలర్‌ నటరాజన్‌ నేర్పుతో బౌలింగ్‌ చేసి స్యామ్‌ కరన్‌ను కట్టడి చేసి కేవలం ఆరు పరుగులిచ్చి టీమిండియాకు విజయాన్ని కట్టబెట్టాడు. భారత బౌలర్లు భువనేశ్వర్‌ (3/42), శార్దుల్‌ (4/67) కీలక వికెట్లు తీశారు. స్యామ్‌ కరన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’... బెయిర్‌స్టోకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి. ( చదవండి: భారత్‌ తీన్‌మార్‌ )

మరిన్ని వార్తలు