'ధోని.. నిజంగా నువ్వు అద్భుతం'

20 Sep, 2020 09:28 IST|Sakshi

దుబాయ్‌ : శనివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్‌ 13వ సీజన్‌కు బీజం పడింది. ఎలాంటి విధ్వంసాలు.. అద్భుతాలు చోటుచేసుకోకుండానే మ్యాచ్‌ మొత్తం కూల్‌గా సాగిపోయింది. 163 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై .. రాయుడు హిట్టింగ్‌.. డుప్లెసిస్‌ క్లాస్‌ బ్యాటింగ్‌ కలగలిపి చెన్నై మొదటి మ్యాచ్‌లో ముంబైపై సూపర్‌ విక్టరీని సాధించింది. ఈ మ్యాచ్‌లో ధోని యాంకర్‌ పాత్ర పోషిస్తూ.. జడేజా, స్యామ్‌ కరన్‌లను తన కంటే ముందు పంపించాడు. స్యామ్‌ కరన్ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొదట బౌలింగ్‌లో ఒక వికెట్‌.. తర్వాత బ్యాటింగ్‌లో 6 బంతుల్లోనే 18 పరుగులు సాధించి చెన్నై గెలుపుకు మార్గం సుగమం చేశాడు. మ్యాచ్‌ పూర్తయిన తర్వాత స్యామ్‌ కరన్ కెప్టెన్‌ ధోనిని ప్రశంసలతో ముంచెత్తాడు. (చదవండి : జడేజా మ్యాజిక్‌.. డుప్లెసిస్‌ సూపర్‌)

'చెన్నై జట్టుతో కలుస్తున్నాననే ఉత్సుకత నాలో కొత్త ఉత్సాహం నింపింది. చెన్నై జట్టుకు ఆడుతున్నా అనే మాటే కానీ.. జట్టులో ఆటగాళ్లతో పెద్దగా కలవలేదు.. ఎందుకంటే నేను ఇంగ్లండ్‌తో సిరీస్‌ ముగిసిన రెండు రోజుల్లోనే దుబాయ్‌కు చేరుకున్నా. రాగానే నేరుగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాల్గొన్నా. నిజాయితీగా చెప్పాలంటే.. నేను ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తా అనేది అప్పటివరకు తెలియదు. మా కెప్టెన్‌ ధోని వచ్చి.. జడేజా తర్వాత వెళ్లాల్సింది నువ్వే.. రెడీగా ఉండు అని చెప్పాడు.

నిజంగా ధోని జీనియస్‌.. లెఫ్ట్‌.. రైట్‌ కాంబినేషన్‌ను దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. యాంకర్‌ పాత్ర పోషిస్తున్న ధోని 18వ ఓవర్‌కు ముందు నా వద్దకు వచ్చి రిస్క్‌ తీసుకొని ఆడు.. ఏదైతే అది జరుగుతుంది.. నీ ఆట నువ్వు ఆడు. కృనాల్‌ వేసిన 18వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడం సంతోషంగా ఉంది. రాయుడు,డుప్లెసిస్‌లు అద్భుతంగా ఆడారు.'అంటూ తెలిపాడు. (చదవండి : రాయుడు అదరగొట్టాడు..)

ఇదే విషయమై మ్యాచ్‌ ముగిసిన తర్వాత ధోని మాట్లాడుతూ.. 'జడేజా, కరన్‌లను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాకంటే ముందు పంపించడంలో ఎలాంటి ఆలోచన లేదు. ఇద్దరు ఆల్‌రౌండర్లే కాబట్టి.. హిట్టింగ్‌ ఆడే అవకాశం ఉండడం.. కీలక సమయంలో సిక్స్‌లు బాది జట్టుకు ఒత్తిడి తగ్గిస్తారనే ప్రమోషన్‌ ఇచ్చా ' అంటూ తెలిపాడు. చెన్నై తన తరువాతి మ్యాచ్‌ సెప్టెంబర్‌ 22న రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆడనుంది.

>
మరిన్ని వార్తలు