సామ్‌ కర్రన్‌ ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు

29 Mar, 2021 16:29 IST|Sakshi

పూణే: భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో సంచలన ప్రదర్శనతో అందరి మనసులను దోచుకున్న ఇంగ్లండ్‌ నవయువ ఆల్‌రౌండర్‌ సామ్ కర్రన్ (83 బంతుల్లో 95 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అరుదైన ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. వన్డేల్లో 8 లేదా ఆ తర్వాత స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగి.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సామ్‌ కర్రన్ అగ్రస్థానంలో నిలిచాడు. 2016లో ఇంగ్లండ్‌ పేసర్ క్రిస్‌ వోక్స్ 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి శ్రీలంకపై అజేయమైన 95 పరుగులు చేసినప్పటికీ...  సామ్‌ కర్రన్‌ తక్కువ బంతుల్లో అదే స్కోర్‌ చేయడంతో ఈ రికార్డ్‌ అతని ఖాతాలో చేరింది. విండీస్‌ విధ్వంసకర యోధుడు ఆండ్రీ రసెల్ 2011లో భారత్‌పై అజేయమైన 92 పరుగులు(9వ స్థానంలో) చేయగా, వెస్టిండీస్‌పై ఆసీస్‌ ఆటగాడు నాథన్ కౌల్టర్ నైల్ 92 పరుగులు(8వ స్థానంలో) చేశాడు. 

కాగా, తాజాగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో సామ్‌ కర్రన్‌ 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అజేయమైన 95 పరుగులు సాధించాడు. సామ్‌ కర్రన్‌ అద్భుత పోరాటం వృధా కావడంతో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. ధవన్‌ (67), పంత్‌ (62 బంతుల్లో 78; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్‌ (44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ శతకాలతో చెలరేగారు. ప్రత్యర్థి బౌలర్లలో మార్క్‌ వుడ్‌ (3/34), రషీద్‌ (2/81) రాణించారు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది. సామ్‌ కర్రన్‌, డేవిడ్‌ మలాన్‌ (50) అర్ధశతకాలు సాధించారు. టీమిండియా బౌలర్లలో శార్దూల్‌ (4/67), భువనేశ్వర్‌ (3/42) సత్తాచాటారు. 
చదవండి: వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన టీమిండియా

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు