Sam Curran: స్టార్‌ క్రికెటర్‌కు చేదు అనుభవం! షాకయ్యానంటూ ట్వీట్‌.. వైరల్‌

5 Jan, 2023 11:57 IST|Sakshi

Sam Curran Tweet Viral: ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌కు చేదు అనుభవం ఎదురైంది. అతడిని విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు సిబ్బంది. అయితే, ఇందుకు గల కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! అసలేం జరిగిందంటే.. బ్రిటిష్‌ ఎయిర్‌లైన్స్‌ వర్జిన్‌ అట్లాంటిక్‌ విమానంలో సామ్‌ ప్రయాణించేందుకు టికెట్‌ బుక్‌ అయింది.

అందులో ప్రయాణం చేయడానికి వీల్లేదట
తీరా అక్కడికి వెళ్తే తను కూర్చోవాల్సిన సీటు విరిగిపోయిందనే రీజన్‌తో సామ్‌ను లోపలికి అనుమతించలేదు. ఈ విషయాన్ని సామ్‌ కరన్‌ స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. ‘‘వర్జిన్‌ అట్లాంటిక్‌ ఫ్లైట్‌ ఎక్కేందుకు నేను సిద్ధమయ్యాను. కానీ సిబ్బంది నన్ను అడ్డుకున్నారు. విమానంలో నేను కూర్చోవాల్సి సీటు విరిగిపోయిందట.

కాబట్టి నేను అందులో ప్రయాణం చేయడానికి వీల్లేదని చెప్పారు. క్రేజీగా ఉంది కదా. ఇది నన్ను విస్మయానికి గురిచేసింది. చాలా ఇబ్బందిగా కూడా అనిపించింది’’ అంటూ సామ్‌ కరన్‌ ఎయిర్‌లైన్స్‌ తీరుపై మండిపడ్డాడు. ఏదేమైనా థాంక్స్‌ వర్జిన్‌ అట్లాంటిక్‌ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

ఇందుకు స్పందించిన సదరు ఎయిర్‌లైన్స్‌ యాజమాన్యం.. సామ్‌ కరన్‌కు క్షమాపణలు చెప్పింది.  ఈ విషయాన్నితమ సిబ్బంది దృష్టికి తీసుకువచ్చినట్లయితే.. అప్పుడే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవాళ్లమని చింతిస్తూ ట్వీట్‌ చేసింది. ఈ నేపథ్యంలో సామ్‌ ట్వీట్‌ వైరల్‌ కాగా.. అభిమానులు అతడికి అండగా నిలుస్తున్నారు. కనీసం ఫస్ట్‌క్లాస్‌లో ప్రయాణానికైనా వీలుగా ఏర్పాట్లు చేయాల్సింది కదా అని పేర్కొంటున్నారు.

కాసుల వర్షం
ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌గా పేరొందిన సామ్‌ కరన్‌ ఇటీవల ముగిసిన ఐపీఎల్‌-2023 మినీ వేలంలో భారీ ధర పలికిన సంగతి తెలిసిందే. అతడి కోసం రాజస్తాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ పోటీపడగా.. ఏకంగా 18.5 కోట్లు పెట్టి పంజాబ్‌ కింగ్స్‌ దక్కించుకుంది.

తద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా సామ్‌ కరన్‌ చరిత్ర సృష్టించాడు. కాగా ప్రపంచకప్‌-2022లో ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన సామ్‌.. ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు. ఈ నేపథ్యంలో వేలంలో అతడిపై కాసుల వర్షం కురవడం గమనార్హం.

మరిన్ని వార్తలు