ఆస్ట్రేలియాలో జయసూర్య కోచింగ్‌ పాఠాలు!

5 Jun, 2021 14:26 IST|Sakshi

కొలంబో: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తనపై విధించిన రెండేళ్ల నిషేధాన్ని పూర్తి చేసుకున్న శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ సనత్‌ జయసూర్య కోచ్‌గా కనిపించనున్నాడు. ఈ మేరకు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరానికి చెందిన మల్‌గ్రేవ్‌ క్రికెట్‌ క్లబ్‌ కోచ్‌గా పనిచేయనున్నాడు. 1996 వన్డే వరల్డ్‌కప్‌ నెగ్గిన జట్టులో జయసూర్య సభ్యుడిగా ఉన్నాడుl. ఐసీసీ అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించాడంటూ 2019 ఫిబ్రవరిలో నిషేధం విధించారు. ఐసీసీ  జరిపిన విచారణను అడ్డుకునే ప్రయత్నం చేయడమే అతనిపై నిషేధానికి కారణం.

అతని ఫోన్‌ను తమకు అందించాలని కూడా ఏసీయూ కోరగా జయసూర్య దానిపై స్పందించలేదు. 2017 సెప్టెంబర్‌ వరకు లంక చీఫ్‌ సెలక్టర్‌గా ఉన్న సమయంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలతో జయసూర్యకు ఉన్న సంబంధాలపై అతనిపై విచారణ చేయగా అందుకు జయసూర్య సహకరించలేదు. దాంతో అతనిపై నిషేధం విధించక తప్పలేదు. 110 టెస్టులు, 445 వన్డేలు, 31 టి20 మ్యాచ్‌లలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు 1996 ప్రపంచ కప్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రిటైర్మెంట్‌ తర్వాత 2010లో పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు. వన్డేల్లో అ‍త్యధిక పరుగులు సాధించిన జాబితాలో జయసూర్య(13430) నాల్గో స్థానంలో ఉన్నాడు.  323 వన్డే వికెట్లు అతని ఖాతాలో ఉ‍న్నాయి.

ఇక్కడ చదవండి: ఆట కోసం ఆస్తులమ్ముకున్నాడు.. దేశాన్ని కూడా వీడాడు

మరిన్ని వార్తలు