కలిసి రాలేదంతే...

26 Jul, 2021 05:12 IST|Sakshi

ఒక్క రౌండ్‌తోనే సానియా జోడీ ఇంటిదారి

పురుషుల హాకీలోనూ ఘోర పరాభవం

ఊరటనిచ్చిన రోయర్లు...

టోక్యో ఒలింపిక్స్‌ తొలి రోజే మీరాబాయి చాను రజత పతకంతో భారత్‌ బోణీ కొట్టగా... రెండో రోజు ఆదివారం మాత్రం భారత శిబిరాన్ని బాగా కుంగదీసింది. ఉదయం షూటింగ్‌లో గురి తప్పగా...టెన్నిస్‌లో భారత జోడీ చేజేతులా ఓడింది. మధ్యాహ్నం స్విమ్మింగ్‌లో బోల్తా కొడితే... హాకీలో పురుషుల జట్టూ ఘోరంగా ఓడింది. బాక్సింగ్, రోయింగ్‌ కాస్త ఊరటనిచ్చాయి అంతే!

టోక్యో: భారత శిబిరంలో అత్యంత ఒలింపిక్స్‌ అనుభవమున్న క్రీడాకారిణి ఎవరైనా ఉంటే అది హైదరాబాద్‌ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జానే! ఇప్పటికే మూడుసార్లు విశ్వ క్రీడల్లో ఆడింది. కెరీర్‌లో నాలుగో ఒలింపిక్స్‌ ఆడుతున్న ఈ విశేష అనుభవజ్ఞురాలు గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా ఓడిపోయింది. ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన అంకిత రైనాతో కలిసి మహిళల డబుల్స్‌లో బరిలోకి దిగిన సానియా ఆట అద్భుతంగా మొదలైనా... చివరకు ఫలితం మాత్రం తొలి రౌండ్లోనే ముగించింది. ఆదివారం జరిగిన మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సానియా–అంకిత జోడీ 6–0, 6–7 (0/7), 8–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో ఉక్రెయిన్‌ సోదరి ద్వయం నదియా–లిద్మిలా కిచెనోక్‌ చేతిలో కంగుతింది.

తొలి సెట్‌ను కేవలం 21 నిమిషాల్లోనే వశం చేసుకున్న భారత జంట రెండో సెట్‌ను, మ్యాచ్‌ను గెలిచే స్థితిలో నిలిచింది. 5–3తో ఆధిక్యంలో ఉండగా సర్వీస్‌ సానియా జోడీదే కాగా... ఈ సర్వీస్‌ నిలబెట్టుకుని ఉంటే భారత్‌కు విజయం ఖాయమయ్యేది. అనూహ్యంగా భారత జంట సర్వీస్‌ చేసిన ఈ గేమ్‌ చేజారడంతో ప్రత్యర్థుల పోరాటంతో ఆట టైబ్రేక్‌కు వెళ్లింది. అక్కడా భారత జోడి ఓడింది. ఒలింపిక్స్‌ నిబంధనల ప్రకారం డబుల్స్‌లో నిర్ణాయక మూడో సెట్‌ ఉండదు. విజేతను తేల్చేందుకు సూపర్‌ టైబ్రేక్‌ నిర్వహిస్తారు. ఇందులో 1–8తో దాదాపు ఓడే దశలో ఉన్నప్పటికీ సానియా–అంకిత జోడీ వరుసగా 7 పాయింట్లు నెగ్గి స్కోరును 8–8 వద్ద సమం చేసింది. కానీ ఆ వెంటనే వరుసగా 2 పాయింట్లు కోల్పోవడంతో ఓటమి తప్పలేదు.

మరిన్ని వార్తలు