Sania Mirza-Shoaib Malik: విడాకులకు సిద్ధమైన సానియా? ‘ఒకే ఒక్క ప్రేమ’ అని ఫరా కామెంట్‌.. ముక్కలైన హృదయం అంటూ..

8 Nov, 2022 10:53 IST|Sakshi
PC: Sania Mirza Instagram

Sania Mirza- Shoaib Malik: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా వ్యక్తిగత జీవితానికి సంబంధించి సోషల్‌ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. భర్త షోయబ్‌ మాలిక్‌తో విభేదాల కారణంగా ఆమె విడాకులకు సిద్దమయ్యారనేది వాటి సారాంశం. కాగా టెన్నిస్‌లో అ‍గ్రశ్రేణి క్రీడాకారిణిగా పలు ఘనతలు అందుకున్న సానియా.. పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. 

బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా 2010 ఏప్రిల్‌లో ఈ క్రీడా జంట వివాహ బంధంలో అడుగుపెట్టింది. వీరికి కుమారుడు ఇజహాన్‌ సంతానం. ఇక పెళ్లైన నాటి నుంచి.. ముఖ్యంగా ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ సమయంలో సానియాను ఉద్దేశించి కొంతమంది ఆకతాయిలు విపరీతమైన ట్రోల్స్‌ చేసేవారు.

అయితే, అవేమీ తమ బంధం మీద ప్రభావం చూపలేవంటూ భర్తతో కలిసి దిగిన ఫొటోలు షేర్‌ చేస్తూ.. ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చేవారు సానియా. కానీ గత కొన్ని రోజులుగా ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తినట్లు పాకిస్తాన్‌ మీడియాలో వార్తలు వస్తున్నట్లు ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌ తన కథనంలో పేర్కొంది. 

అనుమానాలు పెంచిన ఆ కామెంట్‌!
ఇటీవల దుబాయ్‌లో తమ కుమారుడి పుట్టినరోజు(అక్టోబరు 30) సెలబ్రేట్‌ చేసింది ఈ జంట. ఈ క్రమంలో షోయబ్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్‌ చేయగా.. సానియా మాత్రం తాను, తన కొడుకు మాత్రమే కలిసి ఉన్న ఫొటో పంచుకున్నారు.

ఇందుకు స్పందించిన సానియా బెస్ట్‌ ఫ్రెండ్‌, బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ ఫరా ఖాన్‌.. ‘‘నీ జీవితంలో ఉన్న ఒకే ఒక, నిజమైన ప్రేమ.. ఇజహాన్‌తో నిన్ను చూసినప్పుడల్లా నాకిలాగే అనిపిస్తుంది’’ అని కామెంట్‌ చేశారు. దీనితో పాటు ఇటీవల కొడుకు తనను ఆప్యాయంగా ముద్దాడుతున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన సానియా.. ‘‘కఠిన పరిస్థితుల నుంచి నన్ను బయటకు తీసుకువచ్చే క్షణాలు’’ అంటూ క్యాప్షన్‌ జతచేశారు. అంతేకాదు.. ‘ముక్కలైన హృదయం ఎక్కడికి వెళ్తుంది’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాయడం అనుమానాలను మరింత పెంచింది.

ఈ పరిణామాల నేపథ్యంలో భర్తను ఉద్దేశించే సానియా ఇలాంటి పోస్టులు చేస్తున్నారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా షోయబ్‌ మోసాన్ని తట్టుకోలేక సానియా విడాకులకు సిద్ధమయ్యారని.. గత కొన్నాళ్లుగా విడిగా ఉంటున్న ఈ జంట.. కొడుకు కోసం మాత్రమే అప్పుడప్పడూ కలుస్తున్నారంటూ పాక్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అయితే, ఇటు సానియా గానీ.. అటు షోయబ్‌ గానీ ఈ రూమర్లపై నోరు మెదపకపోవడం గమనార్హం. కాగా వెటరన్‌ ఆల్‌రౌండర్‌ షోయబ్‌ మాలిక్‌కు జాతీయ జట్టులో ఇటీవల అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. టీ20 ప్రపంచకప్‌-2022కు అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదన్న సంగతి తెలిసిందే. 

చదవండి: WC 2022: ఇంగ్లండ్‌తో సెమీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ! రోహిత్‌కు గాయం?
Aus Vs Eng: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌.. ఆసీస్‌ జట్టు ప్రకటన.. ప్రపంచకప్‌ లక్ష్యంగా!


 

A post shared by Sania Mirza (@mirzasaniar)

A post shared by Sania Mirza (@mirzasaniar)

మరిన్ని వార్తలు