Sania Mirza: సానియా మీర్జా భావోద్వేగం.. ఓటమితో ముగింపు! కెరీర్‌లో ఎన్ని గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు అంటే?

27 Jan, 2023 11:54 IST|Sakshi
భావోద్వేగానికి లోనైనా సానియా మీర్జా (PC: Australia Open)

Sania Mirza Gets Emotional Video: ‘‘నా ప్రొఫెషనల్‌ కెరీర్‌ ఇక్కడే.. 2005లో 18 ఏళ్ల వయసులో మెల్‌బోర్న్‌లో మొదలైంది.. ఇక్కడే నా గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌ ముగిసిపోతోంది కూడా. రాడ్‌ లావెర్‌ ఎరీనా నాకు ఎంతో ప్రత్యేకం. నా చిన్నారి కుమారుడి సమక్షంలో ఇలా ఇక్కడ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడతానని అస్సలు ఊహించలేదు. 

ఇంతకంటే మరో గొప్ప చోటు ఎక్కడా ఉండదు’’ అంటూ భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా భావోద్వేగానికి లోనయ్యారు. ఆస్ట్రేలియా ఓపెన్‌-2023 మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో ఓటమి తర్వాత తన కెరీర్‌లోని మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.

ఓటమితో ముగింపు
కాగా ఇప్పటికే తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించిన హైదరాబాదీ సానియా మీర్జా కెరీర్‌లో ఇదే ఆఖరి గ్రాండ్‌స్లామ్‌. మరో భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్నతో కలిసి ఫైనల్‌ చేరుకున్న సానియా మెల్‌బోర్న్‌లో జరిగిన శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఓటమిని మూటగట్టుకున్నారు. 

బ్రెజిల్‌ జంట లూసియా స్టెఫానీ- రఫేల్‌ మాటోస్‌ చేతిలో ఓడిపోయిన భారత జోడీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక బ్రెజిల్‌ ద్వయానికి కూడా ఇదే తొలి ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ కావడం విశేషం. 

కన్నీళ్లు పెట్టుకున్న సానియా..
36 ఏళ్ల సానియా మీర్జా కెరీర్‌లో ఇది 11వ గ్రాండ్‌ స్లామ్‌ ఫైనల్‌. కాగా సానియా ఇప్పటి వరకు 43 డబుల్స్‌ టైటిళ్లు గెలిచారు. ఇందులో ఆరు గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీలు ఉన్నాయి. 

నంబర్‌ 1గా.. కానీ అదొక్కటే లోటు
మహిళల డబుల్స్‌లో మూడు, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మూడుసార్లు విజేతగా నిలిచారు. అంతేగాక మహిళల డబుల్స్‌ కేటగిరీలో సానియా 91 వారాల పాటు నంబర్‌ 1 ర్యాంకులో కొనసాగారు. అయితే కెరీర్‌లో ఒక్కసారి కూడా ఆమె మేజర్‌ సింగిల్స్‌ టైటిల్‌ గెలవలేకపోయారు. ఇదే సానియా కెరీర్‌లో పెద్దలోటు అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు తన కుమారుడు ఇజహాన్‌ ఎదుట ఆడిన ఫైనల్లో ఓడిపోయిన సానియా కన్నీళ్లు పెట్టుకుంటూ వీడ్కోలు పలికారు. 

వి లవ్‌ యూ!
ఇందుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన ఆస్ట్రేలియా ఓపెన్‌ నిర్వాహకులు.. ‘‘మేము నిన్ను ప్రేమిస్తూనే ఉంటాము సానియా’’ అని ట్వీట్‌ చేశారు. కాగా వచ్చే నెలలో దుబాయ్‌ వేదికగా జరుగనున్న డబ్లూటీఏ 1000 ఈవెంట్‌ తర్వాత సానియా తన టెన్నిస్‌ కోర్టుకు పూర్తిగా దూరం కానున్నారు.

సానియా మీర్జా గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు- భాగస్వాములు
►2006- ఆస్ట్రేలియా ఓపెన్‌- మిక్స్‌డ్‌ డబుల్స్‌- మహేశ్‌ భూపతి
►2012- ఫ్రెంచ్‌ ఓపెన్‌- మిక్స్‌డ్‌ డబుల్స్‌- మహేశ్‌ భూపతి
►2014- యూ​ఎస్‌ ఓపెన్‌- మిక్స్‌డ్‌ డబుల్స్‌- బ్రూనో సోర్స్‌
►2015- వింబుల్డన్‌- మహిళల డబుల్స్‌- మార్టినా హింగిస్‌
►2015- యూఎస్‌ ఓపెన్‌- మహిళల డబుల్స్‌- మార్టినా హింగిస్‌
►2016- ఆస్ట్రేలియా ఓపెన్‌- మహిళల డబుల్స్‌- మార్టినా హింగిస్‌

చదవండి: Axar Patel: పెళ్లి పీటలెక్కిన టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌.. ఫొటోలు వైరల్‌
Ind Vs NZ: రాంచిలో మ్యాచ్‌ అంటే అంతే! టాస్‌ గెలిస్తే...

మరిన్ని వార్తలు