'భయ్యా నేనంత సోమరిని కాదు.. కావాలంటే చెక్‌ చేసుకో'

20 Jan, 2022 16:26 IST|Sakshi

ఆటలో కామెంటరీకి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. టీవీల్లో మ్యాచ్‌ చూస్తున్న అభిమానులకు తమ పదునైన మాటలు.. క్రీడా విశ్లేషణలతో మరింత రసవత్తరంగా మార్చడం కామెంటేటర్ల పని. అయితే కొన్ని సందర్భాల్లో కామెంటేటర్లు కూడా తమకు తెలియకుండానే నోరు జారడం చూస్తుంటాం. తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు.. కామెంటేటర్‌ సంజయ్‌ బంగర్‌ అదే తప్పు చేశాడు. ఆట బ్రేక్‌ సమయంలో మైక్‌ ఆఫ్‌ చేయడం మరిచిపోయిన సంజయ్‌ మైక్‌ రికార్డర్‌లో అడ్డంగా దొరికిపోయాడు. టీమిండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన తొలి వన్డేలో ఇది చోటుచేసుకుంది. 

చదవండి: జింబాబ్వే బౌలర్‌పై ఐసీసీ సస్పెన్షన్‌ వేటు

టీమిండియా బ్యాటింగ్‌ సమయంలో ఇన్నింగ్స్‌ 39వ ఓవర్‌ పూర్తైన తర్వాత బ్రాడ్‌కాస్టర్‌ బ్రేక్‌ ఇవ్వాలి. కానీ స్కోర్‌ కార్డ్‌ చూపించడం.. అదే సమయంలో బ్రేక్‌ అని భావించిన బంగర్‌ మైక్‌ ఆఫ్‌ చేయకుండానే బ్యాక్‌ఎండ్‌ టీంతో పర్సనల్‌ విషయాలు మాట్లాడాడు. ''నేనంత సోమరిని కాదు భయ్యా.. కావాలంటే చెక్‌ చేసుకో'' అంటూ పేర్కొన్నాడు. అయితే బ్రేక్‌ తర్వాత అసలు విషయం తెలుసుకున్న బంగర్‌ తన పొరపాటును గుర్తించి నవ్వుకున్నాడు. ప్రస్తుతం సంజయ్‌ బంగర్‌ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

భారత్‌తో బుధవారం జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. వాన్‌ డర్‌ డసెన్‌ (96 బంతుల్లో 129 నాటౌట్‌; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్‌ తెంబా బవుమా (143 బంతుల్లో 110; 8 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 30.4 ఓవర్లలో 204 పరుగులు జోడించారు. అనంతరం భారత్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు సాధించి ఓడిపోయింది. శిఖర్‌ ధావన్‌ (84 బంతుల్లో 79; 10 ఫోర్లు), విరాట్‌ కోహ్లి (63 బంతుల్లో 51; 3 ఫోర్లు), శార్దుల్‌ ఠాకూర్‌ (43 బంతుల్లో 50 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేశారు. 

చదవండి: IND vs SA: ఎనిమిదేళ్ల త‌ర్వాత‌ బౌలింగ్‌లో చెత్త రికార్డు.. బ్యాటింగ్‌లో అదుర్స్‌

మరిన్ని వార్తలు