Rishabh Pant: 'పంత్‌ ఓపెనర్‌గా రావాలి.. గిల్‌క్రిస్ట్‌లా చెలరేగి ఆడుతాడు'

21 Jun, 2022 13:03 IST|Sakshi

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను టీమిండియా 2-2తో సమంగా ముగించింది. అయితే ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్‌ పంత్‌ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన పంత్‌ కేవలం 57 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో అతడి ఆటతీరుపై మాజీ క్రికెటర్‌లు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా పంత్‌ పెద్దగా రాణించలేకపోయాడు.

మరో వైపు 37 ఏళ్ల వయస్సులో వెటరన్‌ ఆటగాడు దినేష్‌ కార్తీక్‌ దుమ్ము రేపుతున్నాడు. దీంతో ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు పంత్‌ స్థానంలో కార్తీక్‌ను ఎంపిక చేయాలని చాలా మం‍ది మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో పంత్‌ను ఉద్దేశించి టీమిండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ కీలక వాఖ్యలు చేశాడు. రిషబ్‌ పంత్‌ తన ఫామ్‌ను తిరిగి పొందాలంటే అతడికి ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలని బంగర్‌ తెలిపాడు. ఇందుకు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను ఉదాహరణగా అభివర్ణించాడు

"సచిన్‌ టెండూల్కర్‌ తన వన్డే కెరీర్‌లో తొలి సెంచరీ 75 ఇన్నింగ్స్‌లు తర్వాత సాధించాడు. మిడిలార్డర్‌లో ఎక్కువగా బ్యాటింగ్‌ చేసిన సచిన్‌ అంతగా రాణించలేకపోయాడు. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో ఓపెనర్‌గా వచ్చిన సచిన్‌.. తన కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం భారత జట్టు లెఫ్ట్‌ రైట్‌  కాంబినేషన్‌పై కన్నేసింది. ఇషాన్‌ కిషన్‌ ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్నాడు. ఒక వేళ భారత్‌ ఎక్కువ కాలం పాటు ఇదే కాంబినేషన్‌ కొనసాగించాలంటే.. పంత్‌కు  కూడా ఓపెనర్‌గా రాణించగల సత్తా ఉంది. ఆస్ట్రేలియాకు ఓపెనర్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఏ విధంగా అయితే చెలరేగి ఆడేవాడో.. పంత్‌ కూడా అదే విధంగా ఆడగలడు" అని బంగర్‌ పేర్కొన్నాడు.
చదవండి: Cristiano Ronaldo: కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్‌.. రొనాల్డో క్షేమంగానే

మరిన్ని వార్తలు