బ్యాట్స్‌మన్‌ కంటే కెప్టెన్‌గానే ఎక్కువ చూస్తామేమో!

22 Sep, 2020 08:58 IST|Sakshi

దుబాయ్‌ : భారత మాజీ ఆటగాడు సంజయ్‌ మంజ్రేకర్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్ ధోనిపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోనిని ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఆటగాడిగా కంటే కెప్టెన్‌గానే ఎక్కువగా చూసే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. మంగళవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో సంజయ్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'ఐపీఎల్‌ తొలి రెండు మ్యాచ్‌ల తర్వాత చూస్తే ఒక విషయం మాత్రం నాకు బాగా అర్థమవుతోంది. టోర్నీ రెండు భిన్న తరహాల్లో సాగవచ్చనేది నా అంచనా. ఇప్పుడు సీమర్లు మంచి ప్రభావం చూపిస్తుండగా, బంతి పెద్దగా టర్న్‌ కావడం లేదు.

రాబోయే వారాల్లో మూడు వేదికల్లోనే పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు జరగాల్సి ఉంది కాబట్టి పిచ్‌ల విషయంలో క్యురేటర్లు కచ్చితంగా ఆందోళన చెందుతూ ఉండవచ్చు. భారత్‌లో అయితే కనీసం డజను వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. దీన్ని బట్టి ఇప్పుడు పిచ్‌ల సన్నాహకం ఎంత ఇబ్బందో అంచనా వేయవచ్చు. కాబట్టి పిచ్‌లు తొందరగా పాడు కాకుండా తొలి దశ మ్యాచ్‌లకు కొంత పచ్చిక తప్పనిసరిగా ఉంచాల్సి వస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అరుదుగా కనిపించినట్లుగా... ఎడారిలో మనం గడ్డి మొలవడం చూస్తున్నాం. 'అంటూ తెలిపాడు. 

'సాధారణంగా టర్నింగ్‌ పిచ్‌లపై పండగ చేసుకునే చెన్నై సూపర్‌ కింగ్స్‌ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించడం సంతోషం కలిగించింది. చెన్నై 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించిన ఈ మ్యాచ్‌లో ధోని రెండు బంతులే ఆడి సున్నాతో సరిపెట్టడాన్ని బట్టి నా అభిప్రాయం చెబుతున్నాను. ఈ సీజన్‌లో తాను ఆడటం కాకుండా వెనకనుంచి నడిపించే బ్యాట్స్‌మన్‌ ధోనికంటే మనం పదునైన బుర్రతో మ్యాచ్‌లను శాసించే కెప్టెన్‌ ధోనిని ఎక్కువగా చూడవచ్చేమో. తుది జట్టులోకి స్యామ్‌ కరన్, ఇన్‌గిడిలను తీసుకోవడం, బ్యాటింగ్‌ ఆర్డర్‌లో జడేజా, కరన్‌లను ముందు పంపడం ఇలాంటి వ్యూహాల్లో భాగమే. బలమైన ప్రత్యర్థి ముంబైపై సాధించిన విజయాన్ని బట్టి రాజస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో చెన్నై ఫేవరెట్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.  

రాజస్తాన్‌ జట్టు కూర్పు కొంత ఆసక్తి రేపుతున్నా...అది నిజంగా బలమైన జట్టేనా అంటే కొంత సందేహపడాల్సి వస్తోంది. ఇటీవల ఆ జట్టుకు సంబంధించి కొన్ని సానుకూల అంశాలు మనం చూశాం. ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లలో ఒకడిగా కనిపిస్తున్న జాస్‌ బట్లర్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత ఏడాదికంటే ఇప్పుడు టి20 బ్యాట్స్‌మన్‌గా స్టీవ్‌ స్మిత్‌ ఎంతో ఎదిగాడు. ఆర్చర్‌ బౌలింగ్‌ పదునెక్కింది. బలమైన జట్లతో ఆడేటప్పుడు స్మిత్‌ చివరి వరకు నిలబడి జట్టును నడిపించాల్సి ఉంది. అయితే మొత్తంగా చూస్తే మాత్రం అన్ని రంగాల్లో మెరుగ్గా కనిపిస్తున్న చెన్నైనే ఫేవరెట్‌ అని చెప్పగలను.' అంటూ సంజయ్‌ మంజ్రేకర్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు