రాహుల్‌ శైలి మార్చుకోవాలి

10 Oct, 2020 05:11 IST|Sakshi

సంజయ్‌ మంజ్రేకర్‌

ఈ ఐపీఎల్‌లో నాకు ఆసక్తి కలిగించిన చాలా అంశాల్లో కేఎల్‌ రాహుల్, అతని బ్యాటింగ్‌పై కెప్టెన్సీ ప్రభావం గురించి చెప్పుకోవాలి. రాహుల్‌ అద్భుత ఆటగాడు. కొందరికి మాత్రమే సాధ్యమయ్యే రీతిలో 360 డిగ్రీల్లో ఆడగలడు. అందులోనూ కళాత్మకత ఉంటుంది. క్రికెట్‌ పుస్తకంలో లేని షాట్లను కూడా అందంగా, కవర్‌ డ్రైవ్‌ తరహాలో క్లాస్‌గా ఆడతాడు. ఈ మెగా టోర్నీలో రాహుల్‌కు 2018 ఏడాది చెప్పుకోదగ్గది. ఆ సీజన్‌లోనే రాహుల్‌ గొప్ప టి20 బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. ముఖ్యంగా స్ట్రయిక్‌ రేట్‌ విషయంలో దిగ్గజాలను తలపించాడు. కళ్లు చెదిరేలా 158 స్ట్రయిక్‌రేట్‌తో 659 పరుగులు సాధించాడు. అది నమ్మశక్యం కాని ప్రదర్శన. నిజాయితీగా చెప్పాలంటే దాన్ని మళ్లీ మళ్లీ పునరావృతం చేయలేం. కానీ ఆ తర్వాతి సీజన్‌లోనే అతనిలో మార్పు కనిపించింది.

ముందులా స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయలేకపోయాడు. గణాంకాలను పరిశీలిస్తే అతని స్ట్రయిక్‌రేట్‌ 130కి పడిపోవడం మనం గమనించవచ్చు. చకాచకా వేగంగా పరుగులు సాధించే రాహుల్‌ విషయంలో గణాంకాలు దీన్ని స్పష్టం చేశాయి. గత ఏడాది, 2020లో కూడా రాహుల్‌ 130 స్ట్రయిక్‌రేట్‌లోనే ఆడుతున్నాడు. దీన్ని మనం ఒక మ్యాచ్‌లో చక్కగా గమనించవచ్చు. షార్జాలో రాజస్తాన్‌తో మ్యాచ్‌లో మయాంక్‌ 200 మించిన స్ట్రయిక్‌రేట్‌తో ఆడుతుంటే... అతనితో కలిసి ఎక్కువ భాగం ఆడిన రాహుల్‌ మాత్రం 127 స్ట్రయిక్‌రేట్‌ నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో పంజాబ్‌ ఓడిపోయింది. కచ్చితంగా రాహుల్‌ మాత్రమే ఆ ఓటమికి బాధ్యుడు కాదు. ఇదంతా కెప్టెన్సీ బాధ్యతతో వచ్చిన అదనపు భారమని నేను అనుకోవట్లేదు.

2018 తర్వాత తన వికెట్‌కు రాహుల్‌ అత్యంత ప్రాధాన్యమిస్తుండటంతో ప్రదర్శన దిగజారినట్లుగా అనిపిస్తోంది. ఇది కేవలం ఫ్రాంచైజీ క్రికెట్‌కు మాత్రమే పరిమితం. అదే అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల విషయానికొస్తే రాహుల్‌ స్ట్రయిక్‌రేట్‌ 143గా ఉంది. అక్కడ అతను చాలా సులభంగా పరుగులు చేస్తున్నాడు. ఎందుకు? నా అంచనా ప్రకారం అంతర్జాతీయ టి20లు ఆడేటప్పుడు టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో తనకన్నా క్లాస్‌ ఆటగాళ్లు ఉన్నట్లు రాహుల్‌ భావిస్తాడు. తన వికెట్‌కు అంతగా ప్రాధాన్యం ఇవ్వనవసరం లేదనుకుంటాడు. ఇప్పడు పంజాబ్‌ను పాయింట్ల పట్టికలో పైకి తీసుకెళ్లాలంటే, రాహుల్‌ టీమిండియాకు ఆడే ధోరణిని అవలంభించాలి. ఇతరుల గురించి ఆందోళన వీడాలి. ఇప్పుడు ఆడుతున్న శైలి అతనికిగాని, పంజాబ్‌ జట్టుకు గాని ఏమాదిరిగానూ ఉపయోగపడదు.

మరిన్ని వార్తలు