-

హ్యాట్సాఫ్‌ జడేజా : మంజ్రేకర్‌

3 Dec, 2020 10:38 IST|Sakshi

కాన్‌బెర్రా: గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ సందర్భంగా టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను బిట్స్‌ అండ్‌ పీసెస్‌ క్రికెటర్‌ అంటూ వ్యాఖ్యానించిన కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌.. ఎట్టకేలకు జడేజాపై ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా మూడో వన్డేలో జడేజా 50 బంతుల్లో అజేయంగా 66 పరుగులు సాధించి జట్టు విజయంలో తనవంతు పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించడంతో సోనీ టీవీ కామెంటేటర్‌ ప్యానల్‌లో ఉన్న మంజ్రేకర్‌ తన మాటను సవరించుకోకతప్పలేదు. ఈ మ్యాచ్‌కు ముందు కూడా జడేజా లాంటి క్రికెటర్లను తాను జట్టులో ఎంపిక చేయనంటూ మంజ్రేకర్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే మూడో వన్డేలో టీమిండియా కష్టాల్లో పడ్డ సమయంలో జడేజా బ్యాట్‌ నుంచి ఒక మంచి ఇన్నింగ్స్‌ రావడంతో కామెంటేటర్‌గా ఉన్న మంజ్రేకర్‌ కొనియాడాడు. (చదవండి: పాండ్యా మెరుపులతో... బుమ్రా మలుపుతో...)

‘చివరి మూడు-నాలుగు ఓవర్లు జడేజా ఆడిన తీరు అమోఘం.  జడేజా ఆడిన తీరును ప్రశంసించకుండా ఉండలేకపోతున్నా. ఆఫ్‌ సైడ్‌, లెగ్‌ సైడ్‌ షాట్లతో జడేజా అలరించాడు.  జడేజా బ్యాటింగ్‌ పెర్ఫార్మాన్స్‌కు హ్యాట్సాఫ్‌. ఒక అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడాడు జడేజా. బంతితో కూడా జడేజా ఆకట్టుకున్నా ఇంకా ఎక్కువ తీయాలని కోరుకుంటున్నా. వన్డేల్లో జడేజా మరిన్ని వికెట్లను తీయాలి. గతేడాది కాలంగా జడేజా ప్రదర్శన మెరగవుతూ వస్తోంది. చాలా నిలకడగా ఆడుతున్నాడు. బ్యాటింగ్‌లో సత్తాచాటుతున్నాడు. కానీ బౌలింగ్‌లో ఇంకా మెరుగు కావాలి. భారత్‌కు ఇంకా ఎక్కువ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిపెట్టాలి’ అని మంజ్రేకర్‌ ప్రశంసిచాడు. ఆసీస్‌తో చివరి వన్డేలో రాణించిన మరో  ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను కూడా మంజ‍్రేకర్‌ కొనియాడాడు. ‘పాండ్యా విపరీతమైన ఒత్తిడి గురయ్యాడని అనుకుంటున్నా. దాన్ని అధిగమిస్తూనే అతని అత్యుత్తమ వన్డే ఇన్నింగ్స్‌ను ఆడాడు. పాండ్యా బ్యాటింగ్‌ కారణంగానే టీమిండియా పోటీలో నిలిచింది’ అని మంజ్రేకర్‌ పేర్కొన్నాడు. (చదవండి: ‘ఏంటిది కోహ్లి.. మమ్మల్ని ఇంతలా నిరాశపరిచావు’)

నిన్న ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. పాండ్యా(92 నాటౌట్‌), జడేజా(66 నాటౌట్‌)లు రాణించి జట్టు స్కోరు మూడొందలు దాటడంలో సహకరించాడు. వీరికంటే ముందు కోహ్లి(63) హాఫ్‌ సెంచరీ సాధించాడు. 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ 49.3 ఓవర్లలో 289 పరుగులకే ఆలౌటై పరాజయం చెందింది.  శార్దూల్‌ ఠాకూర్‌ మూడు వికెట్లతో రాణించగా,  బుమ్రా, నటరాజన్‌లు తలో రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్‌, జడేజాలకు తలో వికెట్‌ దక్కింది.

మరిన్ని వార్తలు