ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి: శాంసన్‌

24 Sep, 2020 15:59 IST|Sakshi

షార్జా: ఐపీఎల్‌-13లో రాజస్తాన్‌ రాయల్స్‌ తన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించి శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ బ్యాట్‌ ఝుళిపించి రాజస్తాన్‌ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. 32 బంతుల్లో 1 ఫోర్‌, 9 సిక్స్‌లతో 74 పరుగలు సాధించాడు. ఫలితంగా రాజస్తాన్‌ జట్టు 216 పరుగుల్ని స్కోరు బోర్డుపై ఉంచకల్గింది. ఆపై సీఎస్‌కే 200 పరుగులకే పరిమితమై 16 పరుగుల తేడాతో ఓటమి  పాలైంది.

కాగా, సీఎస్‌కేతో మ్యాచ్‌లో దూకుడుగా ఆడటానికి ఐపీఎల్ కోసం తాను ఎలా సన్నద్ధమయ్యాననే విషయాల్ని వెల్లడించాడు. ఈ దూకుడు వెనుక కఠోర శ్రమ దాగి ఉన్నట్లు సంజూ తెలిపాడు. లాక్‌డౌన్‌ సమయంలో తన మెంటార్‌ రాఫీ గోఫెజ్‌తో కలిసి లెక్కించలేని గంటలు ప్రాక్టీస్‌ చేయడమే ఇందుకు కారణమన్నాడు. గత ఆరు నెలల నుంచి గోమెజ్‌ తన బ్యాటింగ్‌ మెరుగుపడటానికి కారణమయ్యాడన్నాడు. ఈ క్రెడిట్‌ అంతా అతనికే చెల్లుతుందన్నాడు. ‘లాక్‌డౌన్‌ సమయంలో నా వెన్నంటే వారందరికీ థాంక్స్‌. ప‍్రత్యేకంగా నా మెంటార్‌ రఫీ గోమెజ్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సుమారు నాకు 20 వేల బంతుల్ని విసిరి  ప్రాక్టీస్‌లో సాయపడ్డారు. ఈ కష్టానికి ఫలితమే మా తొలి మ్యాచ్‌లో నేను మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకోవడానికి దోహదపడింది’ అని శాంసన్‌ తెలిపాడు.

మాకు ఎక్కువ సౌకర్యాలు లేకపోయినా..
గతంలో కేరళ రంజీ జట్టుకు కెప్టెన్‌గా చేసిన గోమెజ్‌.. శాంసన్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆల్‌రౌండరైన గోమెజ్‌ మాట్లాడుతూ.. ‘లాక్‌డౌన్‌ సమయంలో ప్రాక్టీస్‌ చేయడం చాలా కష్టమనే విషయం అందరికీ తెలుసు. సాధ్యమైనన్ని ఎక్కువ సౌకర్యాలు మాకు అందుబాటులో లేవు. మా టెర్రాస్‌పైనే శాంసన్‌ చేత ప్రాక్టీస్‌ చేయించా. నేను బంతుల్ని విసరడం వాటి నుంచి శాంసన్‌ మెళుకవలు నేర్చుకోవడం చేశాడు. శాంసన్‌ చాలా కఠినపరిస్థితిని ఎదుర్కొన్నాడు. ప్రాక్టీస్‌ కోసం నిద్రలేని రాత్రులు గడిపాడు. ప్రాక్టీస్‌ చేయడమే పరమావధిగా భావించాడు. నేను భిన్నరకాలైన బంతులతో శాంసన్‌ చేత ప్రాక్టీస్‌ చేయించా. ప్రధానంగా బౌన్సర్లు, యార్కర్లుతో పాటు రకరకాల బంతుల్ని శాంసన్‌కు వేశా. లాక్‌డౌన్‌ సమయంలో శాంసన్‌ ప్రాక్టీస్‌ ఇలా సాగింది. బంతిని బ్యాలెన్స్‌ చేస్తూ ఆడటాన్ని నేర్చుకున్నాడు. రోజూ 6 నుంచి 7 గంటలు ప్రాక్టీస్‌ చేసేవాళ్లం. అర్థరాత్రి శాంసన్‌ను నిద్రలోంచి లేపి ప్రాక్టీస్‌ చేసినా చెడ్డ బంతుల్ని సిక్స్‌లుగా మలిచే సామర్థ్యం ఉండాలనే చెబుతూ ప్రాక్టీస్‌ చేయించాను’ అని పేర్కొన్నాడు. ('సామ్సన్‌ తోపు .. కాదంటే చర్చకు రెడీ')

మరిన్ని వార్తలు