‘ఎత్తుపళ్లాలు సహజం.. గేమ్‌ప్లాన్‌ అమలు చేశా’

26 Oct, 2020 15:31 IST|Sakshi
ఆర్‌ఆర్‌ ఆటగాడు సంజూ శాంసన్‌(ఫొటో కర్టెసీ: బీసీసీఐ)

నన్ను నేను నమ్ముకున్నాను: సంజూ శాంసన్‌

అబుదాబి: ‘‘నన్ను నేను నమ్ముతాను. నిజానికి 14 మ్యాచ్‌లు ఆడినప్పుడు కొన్ని ఎత్తుపళ్లాలు చవిచూడకతప్పదు. పెద్ద మైదానాల్లో, విభిన్న రకాల వికెట్ల మీద ఆడేటప్పుడు షాట్‌ సెలక్షన్‌ కోసం కాస్త ఎక్కువ సమయమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ గేమ్‌ప్లాన్‌ను నేను పక్కాగా అమలు చేశాను. అదే ఈనాటి మ్యాచ్‌లో నన్ను కొత్తగా నిలబెట్టింది. ఎన్ని పరుగులు చేస్తున్నాం.. స్ట్రైక్‌రేట్‌ ఎంత ఉంది అన్న విషయాలపై నేను దృష్టిపెట్టలేదు. ప్రతీ బాల్‌ను ఎలా ఎదుర్కోవాలన్న అంశం మీద ఫోకస్‌ చేశాను. అవకాశం వచ్చిన ప్రతిసారి బంతిని బలంగా హిట్‌ చేశాను. అలా కుదరని సమయాల్లో సింగిల్స్‌, డబుల్స్‌ తీయడానికి ప్రాధాన్యం ఇచ్చాను’’ అంటూ రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు సంజూ శాంసన్‌ తన ఆటతీరు పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు వెల్లడించాడు. సింపుల్‌ గేమ్‌ప్లాన్‌ను అమలు చేసి లక్ష్యాన్ని పూర్తిచేసినట్లు పేర్కొన్నాడు. (చదవండి: సంజూ గ్రేట్‌.. పంత్‌ నువ్వు హల్వా, పూరీ తిను’ )

కాగా ఐపీఎల్‌ 2020 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ అద్భుతమైన విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బెన్‌ స్టోక్స్‌(107 నాటౌట్‌; 60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజూ శాంసన్‌(54 నాటౌట్‌; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్స్‌లు)ల అద్భుతంగా రాణించడంతో ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌ ప్రదర్శనపై క్రీడా ప్రముఖులు, కామెంటేటర్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేగాక, ఢిల్లీ కాపిటల్స్‌ ఆటగాడు రిషభ్‌ పంత్‌ ఆటతో పోలుస్తూ, టీమిండియాలో సంజూ శాంసనే తనకు సరైన రీప్లేస్‌మెంట్‌ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచుల్లో అద్భుతంగా రాణించిన సంజూ శాంసన్‌ ఆ తర్వాత చతికిలపడిన విషయం తెలిసిందే. (చదవండి: సీఎస్‌కే ఔట్‌; ఇది కేవలం ఆట మాత్రమే: సాక్షి)

ఐపీఎల్‌-2020 ఆరంభంలో సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 32 బంతుల్లో  ఒక ఫోర్‌, 9 సిక్స్‌లు కొట్టి 74 పరుగులు చేశాడు. ఆ తర్వాత కింగ్స్‌ పంజాబ్‌పై  224 పరుగుల టార్గెట్‌ను రాజస్తాన్‌ ఛేదించడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు 85 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ రెండు అర్ధసెంచరీలు షార్జా మైదానంలోనే చేయడం విశేషం. కానీ ఆ తర్వాత కథ పూర్తిగా మరిపోయింది. తర్వాతి మ్యాచుల్లో 8, 4, 0, 5, 26, 25, 9, 0, 36 పరుగులు మాత్రమే చేసి ఉసూరుమనిపించాడు. మళ్లీ ఆదివారం నాటి మ్యాచ్‌తో ఫాంలోకి వచ్చిన సంజూ శాంసన్‌.. అద్భుత హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జట్టుకు అవసరమైన సమయంలో కీలక మ్యాచ్‌లో ముంబైపై విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో జట్టు విజయానంతరం కామెంటేటర్లతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు.   
 

మరిన్ని వార్తలు