Asia Cup 2022 Ind Vs Pak: ‘భారత్‌తో మ్యాచ్‌లో కచ్చితంగా పాకిస్తాన్‌దే విజయం! ఎందుకంటే.. మాకు’!

19 Aug, 2022 16:24 IST|Sakshi

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఆసియా కప్‌-2022లో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 28న దుబాయ్‌ వేదికగా పాక్‌తో తలపడనుంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఇదే వేదికలో పాక్‌ చేతిలో ఓటమి చెందిన భారత్‌ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.

కాగా దాయాదుల పోరుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ మాజీలు, క్రికెట్‌ నిపుణులు విజేతను ముందుగానే అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ కోవలో పాక్‌ మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్ అహ్మద్ కూడా చేరాడు. ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌లో భారత్‌పై పాక్‌ మళ్లీ విజయం సాధిస్తుందని అహ్మద్ జోస్యం చెప్పాడు.

 

భారత్‌పై మాదే మళ్లీ విజయం !
అహ్మద్ స్పోర్ట్స్ పాక్‌ టీవీతో మాట్లాడుతూ.. "మెగా టోర్నీల్లో ఏ జట్టు అయినా తమ తొలి మ్యాచ్‌ను విజయంతో ఆరంభించాలని భావిస్తుంది. ఆసియాకప్‌లో భాగంగా మా జట్టు తొలి మ్యాచ్‌లో భారత్‌ను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్‌లో మేము పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగుతున్నాము. ఎందుకంటే మేము గతేడాది ఇదే వేదికపై భారత్‌ను మట్టికరిపించాం.

యూఏఈలో పరిస్ధితులు పాకిస్తాన్‌కు బాగా తెలుసు. గతంలో మేము ఇక్కడ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌తో పాటు అనేక  ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా ఆడాము. కాబట్టి ఈ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధిస్తాం. ఇక భారత ఆటగాళ్లకు కూడా ఇక్కడ ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉంది. కానీ వాళ్ల కంటే యూఏఈ పిచ్‌లపై ఆడిన అనుభవం మాకే ఎక్కువ ఉంది" అని పేర్కొన్నాడు.

ఇక ఈ వ్యాఖ్యలపై స్పందించిన భారత అభిమానులు ‘‘అంతలేదు.. ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ వద్దులే. జట్టులో చోటే లేదు కానీ.. ప్రగల్భాలు పలుకుతున్నావా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా గత కొంత కాలంగా సర్ఫరాజ్ అహ్మద్‌కు జాతీయ జట్టులో చోటు దక్కడం లేదు. అతడు చివరగా పాక్ తరపున 2021 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై ఆడాడు.

తొలి మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్‌-శ్రీలంక ఢీ
ఇక ఆసియాకప్‌-2022 యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి దుబాయ్‌ వేదికగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్‌- శ్రీలంక తలపడనున్నాయి. ఇక ఈ టోర్నీలో మెత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. ఇప్పటికే భారత్‌,పాకిస్తాన్‌, శ్రీలంక, ఆఫ్గానిస్తాన్‌, బంగ్లాదేశ్‌ అర్హత సాధించగా.. ఇక మరో స్థానం కోసం క్వాలిఫియంగ్‌ రౌండ్‌లో యూఏఈ, కువైట్, సింగపూర్, హాంకాంగ్ తలపడనున్నాయి. అదే విధంగా ఈ టోర్నీ కోసం ఇప్పటికే భారత్‌,పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్గానిస్తాన్‌ తమ జట్లను ప్రకటించాయి.

చదవండి: IND vs PAK: మ్యాచ్‌కు 15 రోజులుంది.. అప్పుడే జోస్యం చెప్పిన పాంటింగ్‌

మరిన్ని వార్తలు