సర్ఫరాజ్‌ అహ్మద్‌ సెంచరీ.. ‘చేసింది చాలు.. ఇక నాటకాలు ఆపు!’.. ట్వీట్‌ లైక్‌ చేయడంతో మరింత దుమారం

8 Jan, 2023 18:06 IST|Sakshi

సర్ఫరాజ్‌ అహ్మద్‌ (35).. దాదాపు నాలుగేళ్ల తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ ద్వారా జట్టులోకి వచ్చాడు. మూడో టెస్టులో అద్భుత శతకం సాధించిన ఈ పాక్‌ మాజీ కెప్టెన్‌పై నెటిజన్ల ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో 86, 53 పరుగులు చేసిన సర్ఫరాజ్‌.. చివరిదైన రెండో టెస్టులోనూ గొప్ప ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులు, రెండో ఇన్సింగ్స్‌లో 118 (176 బంతులు, 9 ఫోర్లు, 1 సిక్స్‌) పరుగులు చేసి పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.

దీంతో పాక్‌ 0-0తో రెండో టెస్టును, సిరీస్‌ను కాపాడుకోగలిగింది. ఇక సిరీస్‌లో 335 పరుగులు చేసిన ఈ సీనియర్‌ వికెట్‌ కీపర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ గెలుచుకోవడం విశేషం. ఈ క్రమంలో జట్టు సభ్యులు, పాక్‌ క్రికెట్‌ అభిమానుల అభినందనలు వెల్లువెత్తాయి. సెంచరీ అనంతరం పాక్‌ జట్టు కెప్టెన్‌ బాబర్‌ ఆజం, ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌, ఇతర సభ్యులు సర్ఫరాజ్‌కు స్టాండింగ్‌ ఓవేషన్‌ కూడా ఇచ్చారు.

కెరీర్‌ ముగిసిపోతుందనుకున్న సమయంలో జట్టులోకి రావడం, అద్భుతంగా రాణించి సెంచరీ కూడా చేయడంతో సర్ఫరాజ్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతని భార్య కన్నీరు పెట్టుకుంది. ఈక్రమంలో సోషల్‌ మీడియాలో ఓ నెటిజన్‌ పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.

‘జట్టుకు కెప్టెన్‌గా ఎన్నో సేవలందించిన ఆటగాడిని మీ చెత్త రాజకీయాలకు బలిచేశారు. నాలుగేళ్లుగా జట్టుకు దూరం పెట్టి.. వాటర్‌మాన్‌లాగా మార్చి ఘోరంగా అవమానించారు. సర్ఫరాజ్‌ కుటుంబం కన్నీటికి కారణమయ్యారు. ఇప్పుడు యాక్షన్‌లోకి దిగి తుప్పు రేగ్గొట్టేసరికి శభాష్‌! అంటూ కీర్తిస్తున్నారు. నాటకాలు ఆపు. ఇక చాలు!’ అంటూ స్టాండింగ్‌ ఓవేషన్‌ ఫోటో షేర్‌ చేసి బాబర్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశాడు. 
(చదవండి: శివమ్‌ మావి కళ్లు చెదిరే క్యాచ్‌.. హార్దిక్‌ షాకింగ్‌ రియాక్షన్‌ వైరల్‌)

ట్విస్టు ఏంటంటే?
అయితే, సదరు నెటిజన్‌ చేసిన ట్వీట్‌ ఒక ఎత్తయితే, ఆ పోస్టును సర్ఫరాజ్‌ లైక్‌ చేశాడు. దీంతో అప్పటికే వైరల్‌గా మారిన ట్వీట్‌.. ఈ దెబ్బతో హాట్‌ టాపిక్‌ అయింది. అయితే, బాబర్‌ అభిమానులు కొందరు ఈ చర్యను తప్పుబట్టారు. అపార్థాలతో అనర్థమేనని కామెంట్లు చేశారు. దీంతో సర్ఫరాజ్‌ తన పొరపాటును తెలుసుకుని ఆ ట్వీట్‌కు లైక్‌ను తొలగించాడు. ఇదిలాఉండగా 2019, జనవరిలో సర్ఫరాజ్‌ తన చివరి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. అదే ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ నిష్క్రమణ తర్వాత జట్టుకు దూరమయ్యాడు.
(చదవండి: నేను గనుక సూర్యకి బౌలింగ్‌ చేసే ఉంటేనా: హార్దిక్‌ పాండ్యా)

మరిన్ని వార్తలు