Irani Cup 2023: స్టార్‌ క్రికెటర్‌కు దక్కని చోటు.. కారణం ఏంటంటే..?

26 Feb, 2023 16:03 IST|Sakshi

ముంబై స్టార్‌ క్రికెటర్‌, అప్‌ కమింగ్‌ ప్లేయర్‌ సర్ఫరాజ్‌ ‌ఖాన్‌కు దేశవాలీ ప్రతిష్టాత్మక టోర్నీ అయిన ఇరానీ కప్‌లో ఆడే అవకాశం లభించలేదు. మార్చి 1 నుంచి మధ్యప్రదేశ్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా జట్టుకు సర్ఫరాజ్‌ సారధ్యం వహించాల్సి ఉండింది. అయితే చేతి వేలి ఫ్రాక్చర్‌ కారణంగా సెలెక్టర్లు సర్ఫరాజ్‌ పేరును పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. సర్ఫరాజ్‌ గైర్హాజరీలో మయాంక్‌ అగర్వాల్‌ రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా పగ్గాలు చేపడతాడు. డీవై పాటిల్‌ టీ20 కప్‌ సందర్భంగా సర్ఫరాజ్‌కు గాయమైనట్లు సమాచారం. 

కాగా, సర్ఫరాజ్‌ గతకొంతకాలంగా జాతీయ జట్టులో చోటు ఆశిస్తున్న విషయం తెలిసిందే. ఇతను దేశవాలీ టోర్నీల్లో పరుగుల వరద పారిస్తున్నా.. సెలెక్టర్లు ప్రతిసారి మొండిచెయ్యే చూపిస్తున్నారు. సెంచరీలు, డబుల్‌ సెంచరీలు, ట్రిపుల్‌ సెంచరీలు సాధిస్తున్నప్పటికీ.. ఈ ముంబై ఆటగాడిపై సెలెక్టర్లు కనికరం చూపించడం లేదు. ఈ క్రమంలో సర్ఫరాజ్‌ ఒకానొక దశలో సహనం కోల్పోయి సెలెక్టర్లు, బీసీసీఐపై విరుచుకుపడ్డాడు. సెలక్టర్లు తనను మోసం చేశారంటూ వాపోయాడు. 

ఇదిలా ఉంటే, దేశవాలీ కెరీర్‌లో ఇప్పటివరకు 37 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్‌ ఖాన్‌.. 79.65 సగటున 13 శతకాల సాయంతో 3505 పరుగులు చేశాడు. ఇటీవల ముగిసిన రంజీ సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్‌.. 92.66 సగటున 3 సెంచరీల సాయంతో 556 పరుగులు సాధించాడు. 

రెస్టాఫ్ ఇండియా : మయాంక్ అగర్వాల్, సుదీప్ కుమార్, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, హర్విక్ దేశాయ్, ముఖేశ్ కుమార్, అతిత్ సేథ్‌, చేతన్ సకారియా, నవదీప్ సైనీ, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), మయాంక్ మార్ఖండే, సౌరభ్ కుమార్, ఆకాశ్ దీప్, బాబా ఇంద్రజీత్, పుల్కిత్ నారంగ్, యశ్ ధుల్ 


 

మరిన్ని వార్తలు