Sarfaraz Khan: అప్పుడేమో సిద్ధంగా ఉండమన్నారు! కానీ చివరకు.. నేనూ మనిషినే.. నాకూ భావోద్వేగాలు ఉంటాయి..

16 Jan, 2023 13:18 IST|Sakshi
ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ (PC: PTI)

‘‘నేనెక్కడికి వెళ్లినా.. త్వరలోనే ఈ అబ్బాయి టీమిండియాకు ఆడతాడు అంటూ గుసగుసలు వినిపిస్తాయి. ఇక సోషల్‌ మీడియాలో అయితే, జట్టులో నా పేరు లేకపోవడం పట్ల విశేష స్పందన. వేలల్లో మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. నీకూ టైమ్‌ వస్తుంది. వేచి చూడక తప్పదు అని చాలా మంది సలహాలు ఇస్తుంటారు.

స్వదేశంలో సిరీస్‌లకు జట్లను ప్రకటించిన సమయంలో..  అసోంతో మ్యాచ్‌ అనంతరం నేను ఢిల్లీకి వచ్చాను. ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. నేను ఎందుకు సెలక్ట్‌కాలేదు? రోజంతా ఇదే ఆలోచన. అయితే, మా నాన్నతో మాట్లాడిన తర్వాతే నార్మల్‌ అవ్వగలిగాను.

ఏదేమైనా, నేను ప్రాక్టీసు వదలను. డిప్రెషన్‌లోకి వెళ్లను. అవకాశం వచ్చేంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను అని నాకు నేను సర్దిచెప్పుకొన్నాను’’ అంటూ భారత యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తాను కూడా మనిషేనని, యంత్రాన్నైతే కాదు కదా అని ఉద్వేగానికి గురయ్యాడు.

మరోసారి మొండిచేయి
దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్న ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌కు గత కొంతకాలంగా బీసీసీఐ సెలక్టర్లు మొండిచేయి చూపిస్తున్నారు. పరుగుల వరద పారిస్తున్నా జాతీయ జట్టులో మాత్రం చోటుదక్కడం లేదు. స్వదేశంలో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో వరుస సిరీస్‌ల నేపథ్యంలో బీసీసీఐ నుంచి పిలుపు వస్తుందని ఆశించిన అతడికి మరోసారి భంగపాటే ఎదురైంది.

నేనూ మనిషినే!
ఈ నేపథ్యంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన సర్ఫరాజ్‌ ఖాన్‌ తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ‘‘జట్టును ప్రకటించిన సమయంలో అందులో నా పేరు ఉంటుందని ఆశగా ఎదురుచూశాను. కానీ అలా జరగకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాను. 

నేను కాదు.. నా స్థానంలో ఎవరున్నా అలాగే ఫీల్‌ అవుతారు. పరుగులు సాధిస్తూనే ఉన్నాను. అయినా, ఒక్క ఛాన్స్‌ కూడా రావడం లేదు. నేనూ మనిషినే కదా! మెషీన్‌ని కాదు. నాకూ భావోద్వేగాలు ఉంటాయి. 

బంగ్లాదేశ్‌ సిరీస్‌లో అవకాశం అన్నారు!
నిజానికి బెంగళూరులో రంజీ ట్రోఫీ టోర్నీ ఫైనల్‌లో సెంచరీ బాదిన సమయంలో నేను టీమిండియా సెలక్టర్లను కలిశాను. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో నీకు కచ్చితంగా అవకాశం వస్తుంది. సిద్ధంగా ఉండు అని చెప్పారు. ఇటీవలే చేతన్‌ శర్మ సర్‌ని కూడా కలిశాను.


(PC: sarfarazkhan Instagram)

హోటల్‌ నుంచి నిష్క్రమిస్తున్న సమయంలో ఆయనను చూశాను. నువ్వేమీ బాధపడొద్దు. నీకూ కచ్చితంగా అవకాశం వస్తుందని ఆయన చెప్పారు. ఏదేమైనా మంచి రోజులు వస్తాయని ఆశగా ఎదురుచూడాల్సిందే! గొప్ప ఇన్నిం‍గ్స్‌ ఆడినపుడు ఇలాంటి అంచనాలు, ఆశలు సహజమే.

డిప్రెషన్‌లోకి వెళ్లను
కానీ ఏం చేస్తాం! ఇప్పటికే జీవితంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. ఈ గడ్డుకాలం వెళ్లిపోతుందనే భావిస్తున్నా. నా చేతుల్లో ఏమీలేదు. అయితే, ఇలాంటి వాటి వల్ల డిప్రెషన్‌లో కూరుకుపోవాల్సిన అవసరం లేదు’’ అని 25 ఏళ్ల సర్ఫరాజ్‌ ఖాన్‌ చెప్పుకొచ్చాడు.

కాగా.. ప్రస్తుత రంజీ సీజన్‌లో 5 మ్యాచ్‌ల్లో 431 పరుగులు (2 సెంచరీలు) చేశాడు సర్ఫరాజ్‌. ఈ నేపథ్యంలో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరాలంటే కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్‌కు అతడిని ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ అలా జరుగలేదు.

చదవండి: Virat Kohli: అరుదైన ఘనతకు చేరువలో! రికార్డుల కోసం వెంపర్లాడేవాడిని కాదు.. అయితే!
IND vs SL: వారెవ్వా సిరాజ్‌.. శ్రీలంక బ్యాటర్‌కు ఊహించని షాక్‌! వీడియో వైరల్‌
Team India: టెస్టులకు సూర్య.. టి20లకు పృథ్వీ షా, వన్డేల్లో శ్రీకర్‌ భరత్‌ 

మరిన్ని వార్తలు