CWG 2022: టీమ్‌ ఈవెంట్‌లో రజతం, డబుల్స్‌లో స్వర్ణం సాధించిన సాత్విక్‌ సాయిరాజ్‌

9 Aug, 2022 08:09 IST|Sakshi

Amalapuram Satwiksairaj Rankireddy: అమలాపురం కుర్రాడు రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌ అంతర్జాతీయ వేదికపై మరోసారి మెరిశాడు. ప్రతిష్టాత్మక కామన్‌వెల్త్‌ క్రీడల్లో బంగారు పతకం సాధించాడు. డబుల్స్‌ విభాగంలో సహచరుడు చిరాగ్‌శెట్టితో కలిసి ఇంగ్లండ్‌ జట్టుపై సునాయాస విజయం సాధించాడు. కామన్‌వెల్త్‌ డబుల్స్‌ వ్యక్తిగత విభాగంలో తొలిసారి స్వర్ణ పతకంతో అరుదైన ఘనత సాధించాడు.

ఇప్పటికే ఇదే క్రీడల టీమ్‌ ఈవెంట్‌లో రజతం సాధించిన సాత్విక్‌.. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించడం ద్వారా డబుల్‌ ధమాకా కొట్టినట్టయ్యింది. 2018 కామన్‌వెల్త్‌ క్రీడల్లో కూడా సాత్విక్‌ స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నాడు. అయితే అప్పుడు టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం, వ్యక్తిగత విభాగంలో రజతం సాధించగా, ఇప్పుడు ఫలితం తారుమారైంది. 

మూడు నెలలు.. మూడు పతకాలు 
సాత్విక్‌ క్రీడా జీవితంలో ఇప్పుడు స్వర్ణయుగమనే చెప్పాలి. గడచిన మూడు నెలల్లో అతడి బ్యాడ్మింటన్‌ రాకెట్‌కు తిరుగులేకుండా పోయింది. మే నెలలో ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టులో సాత్విక్‌ ఆడిన విషయం తెలిసిందే.

థామస్‌ కప్‌ చరిత్రలోనే భారత జట్టు సాధించిన అతి పెద్ద విజయం ఇది. మూడు నెలలు గడవకుండానే కామన్‌వెల్త్‌లో స్వర్ణం, రజతం సాధించడం ద్వారా మూడు నెలల్లో అంతర్జాతీయంగా మూడు అత్యుత్తమ పతకాలు సాధించిన ఘనతను సాత్విక్‌ సొంతం చేసుకున్నాడు.  

జీవితాశయం చేజారినా.. కుంగిపోకుండా.. 
గత ఏడాది జపాన్‌లో జరిగిన ఒలింపిక్స్‌ డబుల్స్‌ విభాగంలో సహచరుడు చిరాగ్‌శెట్టితో కలిసి మూడు మ్యాచ్‌లకు గాను రెండు గెలిచినా పాయింట్లు తక్కువ కావడంతో క్వార్టర్స్‌కు వెళ్లే అవకాశం కోల్పోయారు. లేకుంటే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో సాత్విక్‌ జంట ఏదో ఒక పతకాన్ని సాధించేది. జీవితాశయమైన ఒలింపిక్‌ పతకం తృటిలో చేజారినా అతడు కుంగిపోలేదు. ఒలింపిక్స్‌ తరువాత ఫ్రాన్స్‌లో జరిగిన సూపర్‌–750లో ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇండియన్‌ ఓపెన్‌–500 విజేతగా నిలిచాడు.  

సంబరాల్లో కుటుంబ సభ్యులు 
సాత్విక్‌ ఘన విజయంతో అతడి కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగి తేలారు. సాత్విక్‌ గెలిచిన వెంటనే అతడి తల్లిదండ్రులు కాశీ విశ్వనాథ్, రంగమణి దంపతులు కేక్‌ కట్‌ చేసి పంచుకున్నారు. మిగిలిన కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ చింతా అనురాధ, కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, ఆర్డీఓ బి.వసంతరాయుడు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి చుండ్రు గోవిందరాజు, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మెట్ల సూర్యనారాయణలు వారిని అభినందించారు. 

మన పిల్లలు బాగా ఆడారు 
ఈ రోజు భారత్‌ బ్యాడ్మింటన్‌కు మంచి రోజు. మన పిల్లలు సాత్విక్, చిరాగ్‌శెట్టి, మహిళా సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యాసేన్‌ స్వర్ణ పతకాలు సాధించడం చాలా ఆనందంగా ఉంది. సాత్విక్‌ తండ్రిగా కన్నా అభిమానిగానే ఆటను ఆస్వాదించాను. ఈ విజయం ఊహించిందే. అయినా గెలుపు మంచి ఉత్సాహాన్నిచ్చింది. - రంకిరెడ్డి కాశీ విశ్వనాథ్, సాత్విక్‌ తండ్రి

మరిన్ని వార్తలు