సూపర్‌ సాత్విక్‌

23 Jan, 2021 06:09 IST|Sakshi

పురుషుల డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో సెమీఫైనల్లోకి

క్వార్టర్‌ ఫైనల్లో పీవీ సింధు, సమీర్‌ వర్మ నిష్క్రమణ

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత డబుల్స్‌ స్టార్, ఆంధ్రప్రదేశ్‌ షట్లర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ మెరిశాడు. అశ్విని పొన్నప్పతో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో... చిరాగ్‌ శెట్టితో కలిసి పురుషుల డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–అశ్విని ద్వయం 18–21, 22–20, 24–22తో ప్రపంచ ఏడో ర్యాంక్, ఐదో సీడ్‌ జోడీ చాన్‌ పెంగ్‌ సూన్‌–గో లియు యింగ్‌ (మలేసియా)పై సంచలన విజయం సాధించింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో గేమ్‌లో సాత్విక్‌ జంట ఏకంగా మూడు మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి జోడీ 21–18, 24–22తో ఒంగ్‌ యెవ్‌ సిన్‌–తియోఈ యి (మలేసియా) జంటపై గెలిచింది.
 
మహిళల, పురుషుల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు 13–21, 9–21తో ప్రపంచ మాజీ చాంపియన్, నాలుగో సీడ్‌ ఇంతనోన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడిపోయింది. 38 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏ దశలోనూ సింధు తన ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయింది. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సమీర్‌ వర్మ పోరాడి ఓడిపోయాడు. ప్రపంచ మూడో ర్యాంకర్‌ ఆండెర్స్‌ ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌)తో 81 నిమిషాలపాటు హోరాహోరీ పోరులో సమీర్‌ వర్మ 13–21, 21–19, 20–22తో పరాజయం పాలయ్యాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో సమీర్‌ 20–19తో విజయానికి పాయింట్‌ దూరంలో నిలిచాడు. అయితే పట్టువదలని ఆంటోన్సెన్‌ వరుస గా మూడు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు