సౌదీ అరేబియా కమాల్‌ కియా... 

23 Nov, 2022 02:44 IST|Sakshi
రెండో గోల్‌ చేశాక సౌదీ అరేబియా ప్లేయర్‌ సలేమ్‌ సంబరం (జెర్సీ నంబర్‌ 10)

అర్జెంటీనాపై సంచలన విజయం

1–2 తేడాతో మెస్సీ బృందం ఓటమి

సౌదీని గెలిపించిన సలేహ్, సలేమ్‌

లుజైల్‌ స్టేడియం 88 వేల మంది ప్రేక్షకులతో హోరెత్తిపోతోంది... అందులో ఎక్కువ భాగం సౌదీ అరేబియా అభిమానులే అయినా... అర్జెంటీనాను ఆరాధించేవారు కూడా తక్కువేమీ కాదు! ఆరంభంలోనే సూపర్‌ స్టార్‌ మెస్సీ గోల్‌తో అర్జెంటీనాకు ఆధిక్యం... మరో మూడుసార్లు బంతి గోల్‌పోస్ట్‌లోనికి... వాటిని రిఫరీ అనుమతించకపోయినా, మెస్సీ బృందం జోరును చూస్తే ఏకపక్ష మ్యాచ్‌ అనిపించింది...

కానీ రెండో అర్ధభాగంలోకి వచ్చేసరికి ‘గ్రీన్‌ ఫాల్కన్స్‌’ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు... ఐదు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ కొట్టేశారు... ఇరు జట్లు సమంగా ఉన్న స్థితిలో 53వ నిమిషం...నవాఫ్‌ అల్‌ అబీద్‌ బంతిని గోల్‌పోస్ట్‌ వరకు తీసుకురాగలిగినా, రొమేరో దానిని హెడర్‌తో సమర్థంగా వెనక్కి పంపగలిగాడు... అయితే పెనాల్టీ ఏరియా కుడివైపు నుంచి అనూహ్యంగా దూసుకొచ్చి న మిడ్‌ఫీల్డర్‌ సలేమ్‌ అల్‌దవ్‌సరి ఇద్దరు ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పించి బంతిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అతడిని నిలువరించేందుకు లియాండ్రో ప్రయత్నించినా లాభం లేకపోయింది.

సలేమ్‌ అద్భుత కిక్‌ అర్జెంటీనా కీపర్‌ మార్టినెజ్‌ను దాటి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. సలేమ్‌ ‘సోమర్‌సాల్ట్‌’తో జట్టు సంబరాలు మిన్నంటగా, అభిమానులతో స్టేడియం దద్దరిల్లింది. చివరి వరకు అదే ఆధిక్యం నిలబెట్టుకొని సౌదీ అరేబియా వరల్డ్‌ కప్‌లో పెను సంచలనం నమోదు చేసింది. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనాకు షాక్‌ ఇచ్చి ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని కుదిపేసింది.   

దోహా: వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్‌ ఆడే సమయానికి మాజీ చాంపియన్‌ అర్జెంటీనా జోరు మీదుంది. గత 36 మ్యాచ్‌లలో ఆ జట్టు ఓడిపోలేదు... 25 గెలవగా, 11 ‘డ్రా’ అయ్యాయి... టైటిల్‌ గెలిచే జట్లలో ఒకటిగా మెస్సీ సేన ఖతర్‌లో అడుగు పెట్టింది. మరోవైపు ప్రపంచ 51వ ర్యాంక్‌ సౌదీ అరేబియా.. 1994 నుంచి ఐదుసార్లు వరల్డ్‌ కప్‌ ఆడిన ఆ టీమ్‌ 3 మ్యాచ్‌ల్లో గెలిచింది. అవీ చెప్పుకోదగ్గవి కావు.

కానీ ఆ దేశ ఫుట్‌బాల్‌ చరిత్రలో అత్యుత్తమ విజయాన్ని మంగళవారం అందుకుంది. మంగళవారం జరిగిన గ్రూప్‌ ‘సి’ పోరులో సౌదీ 2–1 గోల్స్‌ తేడాతో అర్జెంటీనాపై ఘన విజయం సాధించింది. సౌదీ తరఫున సలేహ్‌ అల్‌ షహరి (48వ నిమిషం), సలేమ్‌ అల్‌ దవసరి (53వ నిమిషం) గోల్స్‌ నమోదు చేయగా... లయోనల్‌ మెస్సీ అర్జెంటీనాకు ఏకైక గోల్‌ (10వ నిమిషం) అందించాడు. తొలి హాఫ్‌లో సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించిన అర్జెంటీనా ఆట రెండో హాఫ్‌లో ఒక్కసారిగా పట్టు తప్పగా, సౌదీ దానిని సొమ్ము చేసుకుంది. ఆఖరి వరకు దానిని కొనసాగించి సరైన ఫలితాన్ని అందుకుంది.  వరల్డ్‌ కప్‌ చరిత్రలో అది పెద్ద సంచలనాల్లో ఈ మ్యాచ్‌ కూడా ఒకటిగా మిగిలిపోనుంది.  

ఆ మూడు గోల్స్‌ ఇచ్చి ఉంటే... 
మ్యాచ్‌ ఆరంభంలో అర్జెంటీనా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చింది. రెండు నిమిషాల్లోపే జట్టు ఖాతాలో గోలే చేరేది. అయితే మెస్సీ షాట్‌ను సౌదీ కీపర్‌ ఒవైస్‌ అడ్డుకోగలిగాడు. అయితే లియాండ్రోను హమీద్‌ దురుసుగా అడ్డుకోవడంతో మాజీ చాంపియన్‌కు పెనాల్టీ అవకాశం లభించింది. ప్రశాంతంగా గోల్‌ కొట్టి మెస్సీ జట్టును ముందంజలో నిలిపాడు.

అయితే తర్వాతి మూడు షాట్‌లు అర్జెంటీనాకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. వరుసగా మెస్సీ, మార్టినెజ్‌ (రెండు సార్లు) చేసిన గోల్స్‌ను ‘ఆఫ్‌ సైడ్‌’ నిబంధన ద్వారా రిఫరీ తిరస్కరించాడు. బంతిని గోల్‌ పోస్ట్‌లోకి పంపే సమయంలో గోమెజ్, మార్టినెజ్, రోడ్రిగో చేసిన తప్పులు జట్టును దెబ్బ తీశాయి. లేదంటే అర్జెంటీనా 4–0తో దూసుకుపోయేదే. రెండో అర్ధ భాగంలో మాత్రం సౌదీ చెలరేగింది.

ఆట ఆరంభమైన మూడు నిమిషాల్లోనే షహరి గోల్‌తో లెక్క సమం చేశాడు. అతడిని ఆపేందుకు రొమెరో చేసిన ప్రయత్నం విఫలమైంది. మరో ఐదు నిమిషాల తర్వాత చేసిన గోల్‌తో అరబ్‌ టీమ్‌ ఆధిక్యం అందుకుంది. ఆ తర్వాత ఇంజ్యూరీ టైమ్‌ సహా మరో 60 నిమిషాల పాటు ఆట సాగినా... అర్జెంటీనా స్కోరును సమం చేయడంలో విఫలమైంది.

మెస్సీ అద్భుతంగా ఆడుతూ గోల్‌పోస్ట్‌కు చేరువగా వచ్చిన క్షణంలో హసన్‌ అల్‌ తంబక్తి అతడిని టాకిల్‌ చేసిన తీరు హైలైట్‌గా నిలిచింది. చివరకు సౌదీ ఆటగాళ్ల ఆనందానికి హద్దు లేకపోగా, మెస్సీ విషణ్ణ వదనంతో నిష్క్రమించాడు. మ్యాచ్‌ అంకెల ప్రకారం చూస్తే ఎక్కువ శాతం (69) బంతి అర్జెంటీనా ఆధీనంలోనే ఉన్నా... 14 సార్లు గోల్‌పోస్ట్‌పైకి దాడులు చేసినా (సౌదీ 3 సార్లు), ప్రత్యర్థితో పోలిస్తే ఎక్కువ కార్నర్‌లు (6–2) లభించినా... సౌదీ చేసిన 21 ఫౌల్స్‌తో పోలిస్తే 6 ఫౌల్సే చేసినా... ఆరుగురు సౌదీ ఆటగాళ్లు ఎల్లోకార్డుకు గురైనా చివరకు విజయం మాత్రం సౌదీదే కావడం విశేషం! 

1958 మ్యాచ్‌లో తొలి గోల్‌ సాధించాక ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు ఓడిపోవడం 1958 (జర్మనీ చేతిలో) తర్వాత ఇదే తొలిసారి. తొలి అర్ధ భాగం వరకు 1–0తో ఆధిక్యంలో నిలిచి మ్యాచ్‌లో ఓటమి చవిచూడటం అర్జెంటీనాకు 1930 తర్వాత ఇదే తొలిసారి.  

నేడు జాతీయ సెలవు దినం 
అర్జెంటీనాపై గెలుపు నేపథ్యంలో సౌదీ అరేబియాలో పెద్ద ఎత్తున సంబరాలు కొనసాగుతున్నాయి. ఈ ఆనందాన్నిరెట్టింపు చేస్తూ బుధవారం ఆ దేశంలో సెలవు ఇచ్చేశారు. ప్రజలు ఈ క్షణాన్ని వేడుకలా జరుపుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగ సంస్థలతో పాటు విద్యా సంస్థలకు కూడా సెలవు ఇస్తున్నట్లు దేశపు రాజు సల్మాన్‌ ప్రకటించారు. 

మరిన్ని వార్తలు