Virat Kohli: అవన్నీ తప్పుడు ప్రచారాలు.. అతడే కెప్టెన్: బీసీసీఐ క్లారిటీ

13 Sep, 2021 15:16 IST|Sakshi

Virat Kohli Captaincy
ముంబై:
 టీ20 వరల్డ్‌కప్ 2021 తర్వాత వన్డే, టీ20 ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకోబోతున్నట్టు వచ్చిన వార్తలను బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఖండించారు. మూడు ఫార్మాట్లలోనూ భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లి కొనసాగుతారని, రోహిత్ శర్మ వైట్ బాల్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించడం లేదని తేల్చిచెప్పారు. ఇప్పటిదాకా ఈ విషయం గురించి ఎలాంటి చర్చ జరగలేదని ఆయన తెలిపారు. కాగా అక్టోబర్‌లో యూఏఈ, ఒమన్‌ వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్‌ ... విరాట్ కోహ్లీకి పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఆఖరి టోర్నమెంట్ అని వదంతులు వినిపించిన విషయం తెలిసిందే. ఈ విషయమై జాతీయ మీడియా సైతం కథనాలను ప్రసారం చేసింది.

కాగా.. విరాట్ కోహ్లీ 2017లో ధోని నుంచి అన్ని ఫార్మట్‌లలో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. టీమిండియా కెప్టెన్‌గా కోహ్లీకి మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. కోహ్లీ ఇప్పటికే 65 మ్యాచ్‌ల్లో 38 విజయాలతో టెస్టుల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా అవతరించాడు. కానీ విరాట్‌ సారథ్యంలో భారత్‌ ఐసీసీ ఈవెంట్లలో ఒక్క టైటిల్ కూడా గెలుచుకోలేకపోయింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్తాన్ చేతుల్లో ఓడిన టీమిండియా, ఆ తర్వాత 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీస్‌లో, 2021 ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓటమి చవిచూసింది. అలా కోహ్లి కెరీర్‌లో ఇప్పటివరకు ఆ లోటు(ఐసీసీ ట్రోఫీ గెలవలేదు) అలాగే ఉండిపోయింది. ఈ క్రమంలో ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్‌గా కొనసాగుతున్న టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించనున్నారనే ఊహాగానాలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అయితే, అరుణ్‌ ధుమాల్‌ ప్రకటనతో వాటికి ఇప్పుడు బ్రేక్‌ పడినట్లైంది.

చదవండి: IPL 2021 Second Phase: ఇంగ్లీష్ క్రికెట‌ర్ల‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ క్రికెట‌ర్

మరిన్ని వార్తలు