SCO Vs NZ ODI: అదరగొట్టిన లీస్క్‌.. కానీ పాపం చాప్‌మన్‌ విజృంభణతో.. ఏకైక వన్డేలోనూ..

1 Aug, 2022 10:29 IST|Sakshi
కివీస్‌ ఆటగాళ్లు చాప్‌మన్‌- మిచెల్‌ ఆనందం(PC: BLACKCAPS)

Scotland vs New Zealand, Only ODI: టీ20 సిరీస్‌లో స్కాట్లాండ్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన న్యూజిలాండ్‌ ఏకైక వన్డే మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది. మార్క్‌ చాప్‌మన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో ఏడు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై గెలుపొందింది. కాగా రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, ఒక వన్డే మ్యాచ్‌ ఆడేందుకు కివీస్‌ స్కాట్లాండ్‌ పర్యటనకు వెళ్లింది. 

ఇందులో భాగంగా మిచెల్‌ సాంట్నర్‌ సారథ్యంలోని న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌లో వరుసగా 68, 102 పరుగులతో స్కాట్లాండ్‌పై ఘన విజయం నమోదు చేసింది. ఈ క్రమంలో ఏకైక వన్డేలోనూ గెలుపొంది స్కాట్లాండ్‌ టూర్‌ను విజయంతో పరిపూర్ణం చేసుకుంది. 

మ్యాచ్‌ సాగిందిలా!
ఎడిన్‌బర్గ్‌ వేదికగా ఆదివారం ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచిన ఆతిథ్య స్కాట్లాండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మ్యాథ్యూ క్రాస్‌ 53 పరుగులతో రాణించగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మైఖేల్‌ లీస్క్‌ 85 పరుగుల(55 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు)తో అదరగొట్టాడు.

మిగిలిన వాళ్లలో ఒకరిద్దరు మినహా మిగతావారు ఫర్వాలేదనిపించారు.

దీంతో 49.4 ఓవర్లలో 306 పరుగులు చేసి స్కాట్లాండ్‌ ఆలౌట్‌ అయింది. కివీస్‌ బౌలర్లలో జాకోబ్‌ డఫీ 3, ఫెర్గూసన్‌ 2, టిక్నర్‌ ఒకటి, బ్రాస్‌వెల్‌ 3 వికెట్లు తీయగా.. డారిల్‌ మిచెల్‌ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

అందరూ ఆడేసుకున్నారు!
ఇక లక్ష్య ఛేదనకు దిగిన కివీస్‌కు ఓపెనర్లు మార్టిన్‌ గప్టిల్‌ (47), ఫిన్‌ అలెన్‌(50) శుభారంభం అందించారు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ క్లీవర్‌ 32 పరుగులు చేసి పెవిలియన్‌ చేరగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన మార్క్‌ చాప్‌మన్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. 

75 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. డారిల్‌ మిచెల్‌ సైతం 74 పరుగులు(నాటౌట్‌) చేశాడు. దీంతో 45.5 ఓవర్లకే లక్ష్యం ఛేదించిన న్యూజిలాండ్‌ ఘన విజయం అందుకుంది. మార్క్‌ చాప్‌మన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

స్కాట్లాండ్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ వన్డే:
►టాస్‌: స్కాట్లాండ్‌- బ్యాటింగ్‌
►స్కాట్లాండ్‌ స్కోరు: 306 (49.4)
►న్యూజిలాండ్‌ స్కోరు: 307/3 (45.5)
►విజేత: 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ గెలుపు
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: మార్క్‌ చాప్‌మన్‌
చదవండి: ENG VS SA 3rd T20: బట్లర్‌ సేనకు చుక్కలు చూపించిన షంషి.. మరో సిరీస్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
IND VS WI 2nd T20: టీమిండియా ఆధిపత్యం కొనసాగేనా.. ? రెండో టీ20లో విండీస్‌తో ఢీకి రెడీ అయిన రోహిత్‌ సేన

మరిన్ని వార్తలు