CWG 2022: కామన్‌వెల్త్‌ గేమ్స్‌ చరిత్రలో స్వర్ణం నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగా

6 Aug, 2022 07:02 IST|Sakshi

స్కాట్లాండ్‌కు చెందిన జార్జ్‌ మిల్లర్‌ ‘లేట్‌ వయసు’లో గ్రేట్‌ అనిపించుకున్నాడు. 75 ఏళ్ల 8 నెలల జార్జ్‌ ‘లాన్‌ బౌల్స్‌’ మిక్స్‌డ్‌ పెయిర్‌లో బంగారు పతకం సాధించాడు. మెలనీ ఇన్నెస్‌తో కలిసి విజేతగా నిలిచాడు. తద్వారా కామన్వెల్త్‌ గేమ్స్‌ చరిత్రలో పసిడి పతకం నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. 

క్వార్టర్‌ ఫైనల్లో సింధు, శ్రీకాంత్‌ 
బ్యాడ్మింటన్‌ ఈవెంట్‌లో మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో పీవీ సింధు (భారత్‌) 21–10, 21–9తో కొబుగెబ్‌ (ఉగాండా)పై... పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్‌ (భారత్‌) 21–9, 21–12తో దిమిందు అబెవిక్రమ (శ్రీలంక)పై గెలిచి క్వార్టర్‌ ఫైనల్‌ చేరారు. మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్‌) జంట 21–2, 21–4తో జెమీమా –గనెసా ముంగ్రా (మారిషస్‌) జోడీని ఓడించింది.  

4X400 రిలే ఫైనల్లో భారత్‌: అథ్లెటిక్స్‌ పురుషుల 4్ఠ400 మీటర్ల రిలే విభాగంలో అనస్, నోవా నిర్మల్, అజ్మల్, అమోజ్‌ జేకబ్‌లతో కూడిన భారత బృందం ఫైనల్‌ చేరింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి జ్యోతి యెర్రాజీ 13.18 సెకన్లలో లక్ష్యానికి చేరి ఓవరాల్‌గా పదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది.  

సెమీస్‌లో శ్రీజ: టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్‌ కమల్‌ (భారత్‌) ద్వయం క్వార్టర్‌ ఫైనల్లో 11–7, 8–11, 11–8, 11–13, 11–9తో ఫిచ్‌ఫోర్డ్‌–హో టిన్‌టిన్‌ (ఇంగ్లండ్‌) జంటపై నెగ్గి సెమీఫైనల్‌ చేరింది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో శ్రీజ 9–11, 11–4, 6–11, 9–11, 11–5, 11–4, 11–8తో మో జాంగ్‌ (కెనడా)పై గెలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 

మరిన్ని వార్తలు