'భవిష్యత్తులో అతడు టీమిండియా కెప్టెన్‌ కావడం ఖాయం'

11 Aug, 2022 15:48 IST|Sakshi

టీమిండియా స్టార్‌ ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాపై కివీస్‌ మాజీ ఆటగాడు స్కాట్‌ స్టైరిస్ ప్రశంసల జల్లు కురిపించాడు. హార్దిక్‌ అద్భుతమైన కెప్టెన్సీ నైపుణ్యాలని కలిగి ఉన్నాడని అతడు కొనియాడాడు. అదే విధంగా హార్దిక్‌ భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్‌ అయినా ఆశ్చర్యపోనక్కరలేదని స్టైరిస్ తెలిపాడు.

కాగా ఇప్పటి వరకు మూడు టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియాకు సారథ్యం వహించిన  హార్దిక్‌ అన్ని మ్యాచ్‌ల్లోనూ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు తొలి సారిగా భారత కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్‌ పాండ్యా చేపట్టాడు. కాగా ఈ సిరీస్‌ను పాండ్యా సారథ్యంలోని భారత జట్టు క్లీన్‌ స్వీప్‌ చేసింది.

అనంతరం విండీస్‌తో ఐదో టీ20కు రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరం కావడంతో.. హార్ధిక్‌ కెప్టెన్‌గా వ్యవహారించాడు. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా విజయం సాధించింది. అంతకుముందు ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు సారథ్యం వహించిన హార్దిక్‌.. తమ జట్టుకు అరంగేట్ర సీజన్‌లోనే టైటిల్‌ను అందించాడు.

ఇక గాయం నుంచి కోలుకున్న తర్వాత హార్దిక్‌ పాండ్యా అద్భుతంగా రాణిస్తున్నాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌ రెండు విభాగాల్లోనూ అదరగొడుతున్నాడు. ఇ‍క ఇది ఇలా ఉండగా రోహిత్‌ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్‌ ఎవరన్న దానిపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. కెప్టెన్సీ రేసులో కేఎల్‌ రాహుల్‌ పాటు ,హార్ధిక్‌ పాండ్యా,రిషభ్‌ పంత్‌ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో స్టైరిస్ న్యూస్‌ 18తో తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

"ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో హార్దిక్‌ పాండ్యా ఒకడు. అతడు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్‌ను కలిగి ఉన్నాడు. కాబట్టి  అతడు భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్‌ కావడం ఖాయం. కనీసం భారత టీ20 జట్టుకైనా హార్దిక్‌ సారథ్యం వహించడం మనం చూస్తాం. ఆరు నెలల కిందట అతడికి జట్టులో చోటు దక్కుతుందా లేదా చర్చలు నడిచాయి.

కానీ అతడు తనపై వచ్చిన విమర్శలకు తన అద్భుతమైన ఆటతోనే చెక్‌ పెట్టాడు. ఫుట్‌ బాల్‌లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఏ ఆటగాడైతే వ్యక్తిత్వం, నైపుణ్యం కలిగి ఉంటాడో అతడికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారు. కాబట్టి హార్దిక్‌ లాంటి ఆటగాడు భవిష్యత్తులో భారత కెప్టెన్సీ బాధ్యతలు చేటపట్టిన మనం ఆశచ్చర్యపోనక్కరలేదు" అని స్టైరిస్ పేర్కొన్నాడు.
చదవండి: Ind Vs Zim 2022: మరీ ఇంత బ్యాడ్‌ లక్‌ ఏంటి భయ్యా! రాకరాక వచ్చిన అవకాశం..! మరోసారి గాయం..

మరిన్ని వార్తలు