Ukraine-Russia War: 'పనికిమాలిన చర్య.. రష్యాకు రేసింగ్‌కు వెళితే చెప్పుతో కొట్టుకున్నట్లే'

25 Feb, 2022 08:49 IST|Sakshi

Ukraine-Russia: రష్యా- ఉక్రెయిన్‌ మధ్య తలెత్తిన యుద్ధం సంక్షోభం ప్రపంచాన్ని కలవరపెడుతుంది. రష్యా అమానుష దాడిని ప్రపంచంలోని అన్ని దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. యుద్ధం మంచి పద్దతి కాదని.. వెంటనే ఆపేయాలని మొత్తుకుంటున్నా రష్యా వెనకడుగు వేయడం లేదు. పైగా తమ జోలికి వస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తమను టార్గెట్‌ చేసిన దేశాలకు రష్యా పరోక్షంగా హెచ్చరికలు పంపింది.  రష్యా దుందుడుకు వైఖరిపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు విమర్శలు గుప్పిస్తున్నారు. 

తాజాగా రష్యా- ఉక్రెయిన్‌ సంక్షోభం క్రీడలకు కూడా పాకింది. రష్యాలో జరిగే ఏ క్రీడైనా సరే తాము ఆడబోయేది లేదని పలువురు ఆటగాళ్లు పేర్కొంటున్నారు. ఫార్ములావన్‌ డ్రైవర్‌.. సూపర్‌ స్టార్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ ఇదే విషయాన్ని పేర్కొన్నాడు. నాలుగుసార్లు చాంపియన్‌ అయిన వెటెల్‌ రష్యాలో జరగబోయే ఎఫ్‌ 1 రేసును బహిష్కరిస్తున్నట్లు తెలిపాడు. ఫార్ములా వన్‌ 2022 ప్రీ టెస్టింగ్‌ సీజన్‌ కోసం ప్రస్తుతం బార్సిలోనాలో ఉ‍న్న వెటెల్‌ తాను రష్యా జీపీలో పాల్గొనేది లేదని స్పష్టం చేశాడు.

 ''నేను ఈరోజు ఉదయం లేచేసరికి ఒక వార్త నన్ను షాక్‌కు గురిచేసింది. ఉక్రెయిన్‌పై దాడి చేస్తూ రష్యా అమానుషంగా ప్రవర్తిస్తోంది. ఒక సిల్లీ కారణంతో అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఇది ఎంత మాత్రం ఉపేక్షించేది కాదు. అందుకే ఒకసారి నేను పాల్గొనబోయే రేసింగ్‌ క్యాలెండర్‌ను చూసుకున్నా. అందులో రష్యా కూడా ఉంది. రష్యాలో జరిగే రేసింగ్‌లో పాల్గొనకూడదని ఇప్పుడే నిర్ణయించుకున్నా. ఆ దేశంలో రేసింగ్‌కు వెళితే నా చెప్పుతో నేను కొట్టుకున్నట్లే. అందుకే రష్యాకు వెళ్లను గాక వెళ్లను..'' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: Formula One: 'ఫార్ములావన్‌ను యువతులు ఎగబడి చూస్తున్నారు.. ఆటపై ఇష్టంతో కాదు'

Russia vs Ukraine: బాహుబలితో తలపడగలదా?

మరిన్ని వార్తలు