Sebastian Vettel: జీపీఎస్‌ పెట్టినా వదల్లేదు.. ఫార్ములావన్‌ స్టార్‌కు చేదు అనుభవం

24 May, 2022 13:45 IST|Sakshi

నాలుగుసార్లు ఫార్ములావన్‌ చాంపియన్‌ విజేత.. ఆస్టన్‌ మార్టిన్‌ ఎఫ్‌1 డ్రైవర్‌ సెబాస్టియన్‌ వెటెల్‌కు చేదు అనుభవం ఎదురైంది. వెటెల్‌ బ్యాగును దొంగలు ఎత్తుకెళ్లారు. దొంగలు ఎత్తుకెళ్లిన బ్యాగును వెటెల్‌ జీపీఎస్ ట్రాకర్‌ ద్వారా కనుక్కోవాలనుకున్నప్పటికి ఫలితం లేకుండా పోయింది.

విషయంలోకి వెళితే.. స్పానిష్‌ గ్రాండ్‌ప్రిక్స్‌ ముగించుకొని బార్సిలోనాకు చేరుకున్న సెబాస్టియన్‌ వెటెల్‌ ఒకరోజు అక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాడు. తన కారును హోటల్‌ ముందు పార్క్‌ చేసి లోనికి వెళ్లాడు. పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన వెటెల్‌కు కారులో బ్యాగు కనిపించలేదు. దీంతో దొంగలు ఎత్తుకెళ్లారని భావించిన వెటెల్‌.. బ్యాగులో తన ఐ ఫోన్‌ ఎయిర్‌ పాడ్స్‌కు జీపీఎస్‌ ట్రాకర్‌ ఉన్నట్లు గుర్తొచ్చింది. వెంటనే తన ఐ-ఫోన్‌లో జీపీఎస్‌ ఆన్‌ చేశాడు.

జీపీఎస్‌ లొకేషన్‌ ఆధారంగా తన కారులోనే బయల్దేరిన వెటెల్‌ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశాడు. దారి మధ్యలోనే సదరు దొంగలు తన ఐ ఫోన్‌ ఎయిర్‌ పాడ్స్‌ పడేయడంతో జీపీఎస్‌ అక్కడే ఆగిపోయింది. దీంతో వెటెల్‌ తన బ్యాగు జాడను తెలుసులేకపోయాడు. కాగా ఈ ఏడాది వెటెల్‌ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. తాజాగా ముగిసిన స్పానిష్‌ గ్రాండ్‌ప్రిక్స్‌ను వెటెల్‌ 11వ పొజిషన్‌తో ముగించాడు.

ఆదివారం జరిగిన స్పానిష్‌ గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. 66 ల్యాప్‌ల రేసును వెర్‌స్టాపెన్‌ అందరికంటే వేగంగా గంటా 37 నిమిషాల 20.475 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన ఫెరారీ డ్రైవర్‌ లెక్‌లెర్క్‌ కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో 27వ ల్యాప్‌లో వైదొలిగాడు.

చదవండి: ICC: అంపైరింగ్‌ విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం

Spanish Grand Prix: వెర్‌స్టాపెన్‌ ఖాతాలో నాలుగో విజయం 

మరిన్ని వార్తలు