T20 World Cup Squad: ఆ ఆర్సీబీ ఆటగాడికి ఛాన్స్‌ ఇంకా ఉంది..

18 Sep, 2021 18:19 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)కు ప్రాతినిధ్యం వహించే దేవ్‌దత్‌ పడిక్కల్‌ భారత ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికయ్యే ఛాన్సులు ఇంకా ఉన్నాయని టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ రెండో దశలో ఈ కేరళ కుర్రాడు రాణించగలిగితే టీమిండియాలోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నాడు. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే పొట్టి ప్రపంచకప్‌లో పాల్గొనే 15 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ఇదివరకే  ప్రకటించినప్పటికీ.. ఐసీసీ నిబంధనల ప్రకారం అక్టోబర్‌ 10 వరకు జట్లలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు ఆయా దేశాల క్రికెట్‌ బోర్డులకు అవకాశం ఉంది. దీంతో ఐపీఎల్‌ ఫేస్‌-2లో సత్తా చాటే ఆటగాళ్లకు టీమిండియాలోకి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుత ఐపీఎల్‌లో రాణించగలిగితే పడిక్కల్‌ సహా సంజూ సామ్సన్‌లను భారత సెలెక్షన్‌ కమిటీ పరిగణలోకి తీసుకునే అవకాశముందని తెలిపాడు. పొట్టి ఫార్మాట్‌లో ఇషాన్‌ కిషన్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, కేఎల్‌ రాహుల్‌, సంజూ సామ్సన్‌ లాంటి యువ ఆటగాళ్ల ఆటను ఆస్వాధిస్తానని.. వీరిలో ఒకరిని ఎంపిక చేసుకునే అవకాశం వస్తే కచ్చితంగా పడిక్కల్‌వైపే మొగ్గుచూపుతానని పేర్కొన్నాడు. పడిక్కల్‌ బ్యాటింగ్‌ శైలీ చాలా బాగుంటుందని.. పొట్టి క్రికెట్‌కు అతను సరైన అటగాడని అభిప్రాయపడ్డాడు.

కాగా, గతేడాది ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పడిక్కల్‌.. సెహ్వాగ్‌ లాగే డాషింగ్‌ ఆటతీరుతో వేగంగా పరుగులు రాబట్టి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్‌-2021 ఫస్ట్‌ లెగ్‌లో అతను సాధించిన సూపర్‌ సెంచరీ.. సీజన్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఆ ప్రదర్శనతో శ్రీలంకలో పర్యటించిన భారత జట్టు(ధవన్‌ సేన)లో అతను చోటు దక్కించుకున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 21 మ్యాచ్‌లు ఆడిన పడిక్కల్‌.. 5 హాఫ్‌ సెంచరీలు, సెంచరీ సాయంతో 668 పరుగులు సాధించాడు.     
చదవండి: టీమిండియాకు లక్కీ ఛాన్స్‌.. పాక్‌తో పోరుకు ముందు టాప్‌ జట్లతో మ్యాచ్‌లు..

మరిన్ని వార్తలు