Ravi Kumar Dahiya: ఓడిపోతున్నానని రవి దహియా చేయి కొరికేసిన కజకిస్తాన్‌ రెజ్లర్‌

5 Aug, 2021 15:28 IST|Sakshi

ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా రెజ్లింగ్‌ 57 కేజీల విభాగంలో రవికుమార్‌ దహియా ఫైనల్‌ చేరి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. స్వర్ణం సాధించేందుకు రవికుమార్‌ ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. గురువారం సాయంత్రం రష్యా రెజ్లర్‌ జవుర్‌ ఉగేవ్‌తో రవికుమార్‌ తలపడనున్నాడు. ఈ విషయం పక్కనపెడితే.. బుధవారం కజకిస్తాన్‌కు చెందిన రెజ్లర్‌  నూరిస్లామ్‌ సనయేవ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌ చివరి దశలో సనయేవ్‌ ఓడిపోతున్నా అనే బాధలో రవికుమార్‌ చేతిని కొరకడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే విషయంపై టీమిండియా మాజీ డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. '' ఇదేం పద్దతి.. ఎంత ఓడిపోతున్నాననే బాధలో ఉంటే ప్రత్యర్థి చేయి కొరకడం సమంజసం కాదు. ఇది క్రీడా స్పూర్తికి విరుద్ధం. ఒక ఆటగాడిని గౌరవించే పద్దతి ఇదేనా అంటూ కామెంట్‌ చేశాడు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే..  తొలి భాగం ముగిశాక రవికుమార్‌ 2–1తో ముందంలో ఉన్నాడు. అయితే రెండో భాగం ఆరంభంలో సనయేవ్‌ ఒక్కసారిగా 9–2తో ఏడు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లాడు. అప్పటికి బౌట్‌ ముగిసేందుకు 90 సెకన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. భారీ తేడాతో వెనుకబడినా రవి ఒత్తిడికి లోనుకాలేదు. తన బలాన్నంతా కూడదీసుకొని ‘డబుల్‌ లెగ్‌ అటాక్‌’తో రెండు పాయింట్లు సంపాదించాడు. సనయేవ్‌ను మ్యాట్‌పైకి రవి ఎత్తి పడేయంతో కజకిస్తాన్‌ రెజ్లర్‌ మోకాలికి దెబ్బ తగిలింది. మోకాలికి పట్టీ కట్టుకొని సనయేవ్‌ బౌట్‌ను కొనసాగించగా... వెంటనే రవి మరోసారి అతని రెండు కాళ్లను ఒడిసిపట్టుకొని మళ్లీ ఎత్తి పడేశాడు. ఈసారి రవి తన ప్రత్యర్థి రెండు భుజాలను మ్యాట్‌కు తగిలించి కొన్ని సెకన్లపాటు అలాగే పెట్టి ఉంచాడు. దాంతో నిబంధనల ప్రకారం రవిని ‘విక్టరీ బై ఫాల్‌’ పద్ధతిలో రిఫరీ విజేతగా ప్రకటించారు. అప్పటికి బౌట్‌ ముగియడానికి మరో 39 సెకన్లు మిగిలి ఉన్నాయి. ఒకదశలో 2–9తో వెనుకబడిన రవి చివరకు పాయింట్లతో సంబంధం లేకుండా విజయాన్ని అందుకోవడం విశేషం.

మరిన్ని వార్తలు