IND vs NZ: 'ఆ యువ ఆటగాడిని జట్టులోకి తీసుకోండి.. దుమ్మురేపుతాడు'

15 Nov, 2022 17:35 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022 సెమీస్‌లో ఇంటిముఖం పట్టిన టీమిండియా.. ఇప్పడు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు సిద్దమైంది. ఈ సిరీస్‌కు సీనియర్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, కెఎల్‌ రాహుల్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఈ సిరీస్‌లో భారత జట్టుకు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సారథ్యం వహించనున్నాడు.

 అదే విధంగా యువ ఆటగాడు శుబ్‌మాన్‌ గిల్‌కు తొలి సారి భారత టీ20 జట్టులో చోటు దక్కింది. అయితే  జట్టులో స్థానం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న యువ ఓ‍పెనర్‌ పృథ్వీ షాకు సెలక్టర్లు మరోసారి మొండి చేయి చూపించారు.

ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ పృథ్వీ షాను సెలక్టర్లు పట్టించుకుపోవడాన్ని భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తప్పుబట్టాడు. పృథ్వీ షా చివరిసారిగా టీ20ల్లో టీమిండియా తరపున 2021లో ఆడాడు. అయితే ప్రస్తుత భారత జట్టుకు పృథ్వీ షా ఎంతో ఉంది అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

హిందూస్తాన్‌ టైమ్స్‌తో సెహ్వాగ్ మాట్లాడుతూ.. "ప్రస్తుత భారత జట్టులో పృథ్వీ షాను నేను చూడాలని అనుకుంటున్నాను. షాని న్యూజిలాండ్‌ సిరీస్‌కు ఎంపికచేయాల్సింది. అతడు చాలా కాలం నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. పృథ్వీ షా విధ్వంసకర ఆటగాడు.

అతడికి పవర్‌ ప్లేలో పరుగులు రాబట్టే సత్తా ఉంది. టీ20 క్రికెట్‌లో పృథ్వీ షా లాంటి ఆటగాడు అవసరం. కనీసం అతడిని రిజర్వ్ ఆటగాడిగానైనా పరిగణలోకి తీసుకోవాలి. త్వరలో వన్డే ప్రపంచకప్‌ భారత్‌ వేదికగా జరగనుంది. ఈ మెగా ఈవెంట్‌లోనైనా పృథ్వీ షాకి అవకాశం ఇవ్వండి" అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: Shaheen Afridi: నీకసలు సిగ్గుందా? నా ఎదురుగా నువ్వు ఉంటేనా: వసీం అక్రమ్‌

మరిన్ని వార్తలు