సీఎస్‌కేపై సెహ్వాగ్‌ సెటైర్లు

26 Sep, 2020 16:20 IST|Sakshi

న్యూఢిల్లీ:ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అంబటి రాయుడు చలవతో తొలి మ్యాచ్‌లో గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఆపై వరుసగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడంపై టీమిండియా మాజీ ఓపెనర్‌, సెటైర్ల కింగ్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ వ్యంగ్యాస్త్రాలు సాధించాడు.ఇక మ్యాచ్‌కు సిద్ధమయ్యే ముందు గ్లూకోజ్‌ ఎక్కించుకుని రావాలంటూ సీఎస్‌కే బ్యాట్స్‌మెన్‌కు చురకలంటించాడు. మంగళవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌తో పాటు, శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ధోని గ్యాంగ్‌ ఓటమి పాలైంది. ప్రధానంగా బ్యాటింగ్‌లో విఫలం కావడంతో ఢిల్లీతో మ్యాచ్‌లో దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాటింగ్‌ను సెహ్వాగ్‌ ప్రస్తావిస్తూ విమర్శలు చేశాడు. క్రీజ్‌లో నిలబడి పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న సీఎస్‌కే బ్యాట్స్‌మెన్‌కు ఇక ముందు గ్లూకోజ్‌ ఎక్కించి పంపించాలని తన ట్వీట్‌లో ఎద్దేవా చేశాడు.ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది.(చదవండి:'అనుష్క జీ.. ఆయన వయసుకు గౌరవమివ్వండి')

ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో విజయాన్ని నమోదు చేసింది. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా వరుసగా రెండో గెలుపును అందుకుంది. అదే సమయంలో సీఎస్‌కే వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడింది. ఢిల్లీ నిర్దేశించిన 176 పరుగుల ఛేదనలో సీఎస్‌కే ఏడు వికెట్లు కోల్పోయి 131 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఢిల్లీతో మ్యాచ్‌లో సీఎస్‌కేకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు షేన్‌ వాట్సన్‌(17), మురళీ విజయ్‌(10)లు నిరాశపరిచారు. అటు తర్వాత డుప్లెసిస్‌(43; 35 బంతుల్లో 4 ఫోర్లు), కేదార్‌ జాదవ్‌(26;21 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా మిగతా వారు విఫలయ్యారు. రుతురాజ్‌ గైక్వాడ్‌(5) తీవ్రంగా నిరాశపరచగా, ధోని(15) నుంచి మెరుపులు రాలేదు. అంతకుముందు  ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. పృథ్వీ షా(64; 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌), శిఖర్‌ ధావన్‌(35; 27 బంతుల్లో  3 ఫోర్లు, 1 ఫోర్‌), శ్రేయస్‌ అయ్యర్‌(26), రిషభ్‌ పంత్‌(37; 25 బంతుల్లో 6 ఫోర్లు)లు రాణించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. 

సెహ్వాగ్‌-ధోని(ఫైల్‌ఫోటో)

Poll
Loading...
మరిన్ని వార్తలు