Dutee Chand: మసాజ్‌ చేయమని బెదిరించేవారు.. షాకింగ్‌ విషయాలు వెల్లడించిన భారత మహిళా అథ్లెట్‌

5 Jul, 2022 11:31 IST|Sakshi

భువనేశ్వర్‌లోని (ఒడిశా) స్పోర్ట్స్ హాస్టల్‌లో సీనియర్ల వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్ధిని రుచిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై భారత స్టార్‌ మహిళా స్ప్రింటర్‌, ఒలింపిక్‌ అథ్లెట్‌, స్పోర్ట్స్ హాస్టల్‌ మాజీ విద్యార్ధిని ద్యుతీ చంద్‌‌ స్పందించింది. స్పోర్ట్స్ హాస్టల్‌లో తాను ర్యాగింగ్‌ బాధితురాలినే సంచలన విషయాలను వెల్లడించింది. సీనియర్లు ర్యాగింగ్‌ పేరుతో తనతో అసభ్యంగా ప్రవర్తించేవారని, బాడీ మసాజ్ చేయమని బెదిరించేవారని ఆరోపించింది. వారు చెప్పిన విధంగా చేయకపోతే టార్చర్ పెట్టేవారని వాపోయింది. 

రుచిక లాగే తాను కూడా హాస్టల్లో దుర్భర అనుభవాలను ఎదుర్కొన్నానని తెలిపింది. స్పోర్ట్స్‌ హాస్టల్‌లో గడిపిన రెండేళ్లు నిద్రలేని రాత్రులు గడిపానని, తన బాధను హాస్టల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా  ఉపయోగం లేకపోయేదని, సీనియర్లపై కంప్లైంట్‌ చేసినందుకు అధికారులు తననే రివర్స్‌లో తిట్టేవాళ్లని గత అనుభవాలను గుర్తు చేసుకుంది. హాస్టల్‌ అధికారులు తన పేదరికాన్ని చూసి హేళన చేసే వారని, తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా అవమానించేవారని సోషల్‌మీడియా వేదికగా తన అనుభవాలను పంచుకుంది. క్రీడాకారులు ఇలాంటి ఘటనల వల్ల చాలా డిస్టర్బ్‌ అవుతారని, తాను కూడా హాస్టల్లో గడిపిన రోజుల్లో మానసికంగా కృంగిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, రుచిక ఆత్మహత్య చేసుకున్న హాస్టల్‌లోనే ద్యుతీ 2006 నుంచి 2008 వరకు గడిపింది. 
చదవండి: గీతిక, అల్ఫియా ‘పసిడి’ పంచ్‌


 

మరిన్ని వార్తలు