బ్లాటర్‌పై మళ్లీ నిషేధం

25 Mar, 2021 01:20 IST|Sakshi

రూ. 7 కోట్ల 75 లక్షల జరిమానా కూడా విధించిన ‘ఫిఫా’

జ్యూరిక్‌ (స్విట్జర్లాండ్‌): అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) మాజీ అధ్యక్షుడు సెప్‌ బ్లాటర్‌పై మళ్లీ నిషేధం విధించారు. జరిమానా కూడా కట్టమన్నారు. తన పరిపాలన దక్షతతో ‘ఫిఫా’ను ఆర్థిక పరిపుష్టి చేసిన బ్లాటర్‌ అదే సమయంలో స్వామి కార్యాన్ని, స్వకార్యాన్ని నెరవేర్చుకునే పనిలో ఆర్థిక అవకతవకలు చేశారు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. దీనిపై విమర్శలు వెలువెత్తడంతో దర్యాప్తు చేసిన ‘ఫిఫా’ ఎథిక్స్‌ కమిటీ అధికార దుర్వినియోగం, ఆర్థిక అవకతవకలు నిజమేనని తేల్చింది. దీంతో గతంలోనే ఆరేళ్ల నిషేధం విధించారు.

ఇదింకా ముగియనే లేదు. ఈ ఏడాది అక్టోబర్‌లో గత నిషేధం పూర్తవుతుంది. దీనికి ఏడు నెలల ముందే 85 ఏళ్ల మాజీ అధ్యక్షుడిపై మరో దఫా నిషేధాన్ని విధిస్తున్నట్లు ‘ఫిఫా’ బుధవారం ప్రకటించింది. అలాగే 10 లక్షల స్విస్‌ ఫ్రాంక్స్‌ (రూ. 7 కోట్ల 75 లక్షలు) జరిమానా కూడా విధించింది. గత డిసెంబర్‌లో బ్లాటర్‌ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించి కోమాలోకి వెళ్లిపోయారు. ఇటీవలే కాస్త కుదుటపడి కోమా నుంచి బయటపడినప్పటికీ నిషేధం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. ఈ అవకతవకల్లో భాగమైన ‘ఫిఫా’ మాజీ కార్యదర్శి వాల్కేపై 2025 అక్టోబర్‌ వరకు నిషేధం ఉంది. ఆయనపై ఏకంగా పదేళ్ల నిషేధం విధించారు. 

మరిన్ని వార్తలు