US Open 2022: రెండో రౌండ్‌కు దూసుకెళ్లిన సెరెనా

30 Aug, 2022 17:02 IST|Sakshi

న్యూయార్క్‌: కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్‌ ఆడుతున్నట్లు ప్రకటించిన అమెరికా నల్లకలువ, టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌.. యూఎస్‌ ఓపెన్‌ 2022లో రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సెరెనా.. మాంటెనెగ్రోకు చెందిన డంకా కొవినిక్‌పై 6-3, 6-3 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. 

కెరీర్‌లో 23 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ సాధించిన 40 ఏళ్ల సెరెనా.. తొలి రౌండ్‌లో ఏమాత్రం తడబాటుకు గురికాకుండా ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. సెరెనా కెరీర్‌లో ఇదే చివరి మ్యాచ్‌ అవుతుందేమోనని ఆమె అభిమానులు స్టేడియం వద్ద బారులు తీరారు. ఆర్థర్‌ యాష్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ను దాదాపు 23000 మంది వీక్షించినట్లు నిర్వహకులు తెలిపారు. 

మాజీ వరల్డ్‌ నంబర్‌ 1, ప్రస్తుత 605వ ర్యాంకర్‌ అయిన సెరెనా తొలి రౌండ్‌లో తన కంటే చాలా మెరుగైన ర్యాంకర్‌ డంకా కొవినిక్‌ (80వ ర్యాంక్‌)పై అలవోకగా విజయం సాధించడంతో ఆమె అభిమానులు ఆనందంలో మునిగితేలారు. తమ ఆరాధ్య క్రీడాకారిణి మరో గ్రాండ్‌స్లామ్‌ నెగ్గి, అత్యధిక సింగిల్స్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించిన క్రీడాకారిణిగా మార్గరెట్‌ కోర్ట్‌ (ఆస్ట్రేలియా–24 టైటిల్స్‌) రికార్డును సమం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఈ మ్యాచ్‌తో పాటు కేవలం రెండే మ్యాచ్‌లు గెలిచిన సెరెనా.. రెండో రౌండ్‌లో వరల్డ్‌ నంబర్‌ 2 ఎస్టోనియాకు చెందిన అన్నెట్‌ కొంటావెట్‌ను ఢీకొట్టాల్సి ఉంది.
చదవండి: US Open 2022: సెరెనాపైనే దృష్టి

మరిన్ని వార్తలు