Wimbledon 2022: పోరాడి ఓడిన సెరెనా విలియమ్స్‌..!

30 Jun, 2022 06:58 IST|Sakshi

లండన్‌: అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన ప్లేయర్‌గా ఆల్‌టైమ్‌ రికార్డును సమం చేసేందుకు సెరెనా విలియమ్స్‌ మరికొంతకాలం వేచి చూడక తప్పదు. ఇప్పటికే 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ఈ అమెరికా దిగ్గజం ఏడాది తర్వాత పునరాగమనం చేసిన టోర్నీలో తొలి రౌండ్‌ను దాటలేకపోయింది. గత సంవత్సరం జూన్‌ 29న వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ తొలి రౌండ్‌లో గాయం కారణంగా మ్యాచ్‌ మధ్యలోనే వైదొలిగిన 40 ఏళ్ల సెరెనా ఆ తర్వాత మళ్లీ రాకెట్‌ పట్టలేదు. ఏడాది తర్వాత వింబుల్డన్‌ టోర్నీ ద్వారా పునరాగమనం చేసిన ఈ నల్లకలువకు ఊహించని పరాజయం ఎదురైంది.

ప్రపంచ 115వ ర్యాంకర్‌ హార్మనీ టాన్‌ (ఫ్రాన్స్‌)తో భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మ్యాచ్‌లో సెరెనా 5–7, 6–1, 6–7 (7/10)తో ఓడిపోయింది. 3 గంటల 11 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఏడుసార్లు చాంపియన్‌ సెరెనా 54 అనవసర తప్పిదాలు చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను 17 సార్లు బ్రేక్‌ చేసే అవకాశం వచ్చినా ఆరుసార్లు మాత్రమే సద్వినియోగం చేసుకుంది. తొలిసారి వింబుల్డన్‌ టోర్నీలో ఆడుతున్న హార్మనీ... సెరెనా సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసింది. నిర్ణాయక టైబ్రేక్‌లో సంయమనం కోల్పోకుండా ఆడిన హార్మనీ తన కెరీర్‌లోనే గొప్ప విజయం సాధించింది.

తనకిదే చివరి వింబుల్డన్‌ టోర్నీనా కాదా అనేది చెప్పలేనని, ఆగస్టు–సెప్టెంబర్‌లలో జరిగే యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో పాల్గొంటానని సెరెనా వ్యాఖ్యానించింది. 2017లో చివరిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ రూపంలో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన సెరెనా ఆ తర్వాత నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో (2018, 2019–వింబుల్డన్‌; 2018, 2019–యూఎస్‌ ఓపెన్‌) ఫైనల్‌కు చేరుకున్నా నాలుగింటిలోనూ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.  
సంచలనాల మోత
వింబుల్డన్‌ టోర్నీలో బుధవారం మహిళల సింగిల్స్‌లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. రెండో సీడ్‌ అనెట్‌ కొంటావీట్‌ (ఎస్తోనియా), తొమ్మిదో సీడ్‌ గార్బిన్‌ ముగురుజా (స్పెయిన్‌), పదో సీడ్‌ ఎమ్మా రాడుకానూ (బ్రిటన్‌) రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. జూలీ నిమియెర్‌ (జర్మనీ) 6–4, 6–0తో కొంటావీట్‌పై, కరోలినా గార్సియా (ఫ్రాన్స్‌) 6–3, 6–3తో 2021 యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ రాడుకానూపై, గ్రీట్‌ మినెన్‌ (బెల్జియం) 6–4, 6–0తో 2017 వింబుల్డన్‌ విజేత ముగురుజాపై గెలిచి మూడో రౌండ్‌కు చేరారు.
రూడ్‌ అవుట్‌...
పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ (సెర్బి యా) 6–1, 6–4, 6–2 తో కొకినాకిస్‌ (ఆస్ట్రేలియా)పై అలవోకగా గెలిచి మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. మూడో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే) 6–3, 2–6, 5–7, 4–6తో హంబర్ట్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడాడు.
ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో తొమ్మిదో సీడ్‌ కామెరాన్‌ నోరీ (బ్రిటన్‌) 3 గంటల 13 నిమిషాల్లో 6–4, 3–6, 5–7, 6–0, 6–2తో మునార్‌ (స్పెయిన్‌)పై, 22వ సీడ్‌ బాషిలాష్‌విలి (జార్జియా) 7–6 (9/7), 0–6, 7–5, 7–6 (7/5)తో క్వెన్‌టిన్‌ హెల్స్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచారు.
చదవండి: Malaysia Open 2022: సింధు ముందుకు.. సైనా ఇంటికి

మరిన్ని వార్తలు