సెరెనా మరో ‘సారీ’

12 Sep, 2020 02:16 IST|Sakshi

యూఎస్‌ ఓపెన్‌ సెమీస్‌లో పరాజయం

ఫైనల్‌ చేరిన అజరెంకా

తుది పోరుకు ఒసాకా

నేడు ఫైనల్‌ అజరెంకా X ఒసాకా 

నేటి రాత్రి గం. 1.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌–1, 2, హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం

సొంతగడ్డపై ఆల్‌టైమ్‌ అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ రికార్డును సమం చేయాలని ఆశించిన అమెరికా దిగ్గజ టెన్నిస్‌ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ ఆశలు ఆవిరయ్యాయి. వ్యక్తిగత జీవితంలోని సమస్యల నుంచి బయటపడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ‘బెలారస్‌ మమ్మీ’ విక్టోరియా అజరెంకా ఏడేళ్ల విరామం తర్వాత మరో ‘గ్రాండ్‌’ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. గతంలో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో సెరెనాతో ఆడిన 10 సార్లూ ఓటమి వైపు నిలిచిన అజరెంకా 11వ సారి మాత్రం స్ఫూర్తిదాయక ఆటతో విజయతీరాలకు చేరింది. తద్వారా కెరీర్‌లో ఐదోసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు మాజీ చాంపియన్‌ నయోమి ఒసాకా తన జోరు కొనసాగిస్తూ అజరెంకాతో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. ఫైనల్లో ఎవరు గెలిచినా వారి ఖాతాలో మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ చేరుతుంది.

న్యూయార్క్‌: తనదైన రోజున మేటి క్రీడాకారిణులను ఓడించే సత్తా తనలో ఇంకా ఉందని బెలారస్‌ క్రీడాకారిణి, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ విక్టోరియా అజరెంకా నిరూపించింది. ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఆమె టైటిల్‌ పోరుకు అర్హత పొందింది. అమెరికా దిగ్గజ క్రీడాకారిణి, 23 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ విజేత సెరెనా విలియమ్స్‌తో గంటా 55 నిమిషాలపాటు జరిగిన యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో అన్‌సీడెడ్‌ అజరెంకా 1–6, 6–3, 6–3తో విజయం సాధించింది. అజరెంకా చివరిసారి 2013లో ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ (యూఎస్‌ ఓపెన్‌ రన్నరప్‌)లో ఫైనల్‌ చేరింది. 38 ఏళ్ల సెరెనాతో  కెరీర్‌లో 23వసారి తలపడిన 31 ఏళ్ల అజరెంకా తొలి సెట్‌లో నిరాశ పరిచింది. కేవలం ఒక గేమ్‌ను గెల్చుకొని 34 నిమిషాల్లో సెట్‌ను చేజార్చుకుంది.. దాంతో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మ్యాచ్‌ల్లో సెరెనా చేతిలో ఆమెకు వరుసగా 11వ సారీ ఓటమి తప్పదేమోనని అనిపించింది.

కానీ అజరెంకా రెండో సెట్‌లో గాడిలో పడింది. ఐదో గేమ్‌లో, తొమ్మిదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌లను బ్రేక్‌ చేసిన ఆమె 35 నిమిషాల్లో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్‌లోని రెండో గేమ్‌లో సెరెనా 0–1తో వెనుకబడి తన సర్వీస్‌లో 30–40తో వెనుకంజలో ఉన్నపుడు బ్యాక్‌హ్యాండ్‌ షాట్‌ ఆడే క్రమంలో సెరెనా ఎడమకాలు మడత పడింది. దాంతో ఆమె చికిత్స కోసం మూడు నిమిషాలు విరామం తీసుకుంది. ట్రైనర్‌  కాలి మడమకు పట్టీ కట్టాక బరిలోకి దిగిన సెరెనా తన సర్వీస్‌ను కోల్పోయింది. సెరెనా సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన అజరెంకా మూడో గేమ్‌లో తన సర్వీస్‌ నిలబెట్టుకొని 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సెరెనా స్కోరును సమం చేసేందుకు విఫలయత్నం చేసినా అజరెంకా తడబడకుండా చివరకు 6–3తో సెట్‌ను నెగ్గి విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్‌ మొత్తంలో అజరెంకా రెండు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. మరోవైపు సెరెనా ఆరు ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది.
ఎదురులేని ఒసాకా... 
28వ సీడ్‌ జెన్నిఫర్‌ బ్రేడీతో 2 గంటల 8 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో నాలుగో సీడ్‌ ఒసాకా 7–6 (7/1), 3–6, 6–3తో నెగ్గింది. ఇద్దరూ పవర్‌ఫుల్‌ ఆట కనబర్చడంతో మ్యాచ్‌ మొత్తంలో ఇద్దరూ ఒక్కోసారి మాత్రమే తమ సర్వీస్‌లను కోల్పోయారు. తొలి సెట్‌లో ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్‌ అనివార్యమైంది. టైబ్రేక్‌లో ఒసాకా పైచేయి సాధించింది. రెండో సెట్‌లో బ్రేడీ ఎనిమిదో గేమ్‌లో ఒసాకా సర్వీస్‌ను బ్రేక్‌ చేసి తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌ను 6–3తో దక్కించుకుంది.

మూడో సెట్‌లో ఒసాకాకు కాస్త అదృష్టం కూడా కలిసొచ్చింది. ఒసాకా 2–1తో ఆధిక్యంలో ఉన్నపుడు బ్రేడీ తన సర్వీస్‌లో లైన్‌ అంపైర్‌ నిర్ణయాన్ని సమీక్షంచకపోవడం ఒసాకాకు కలిసొచ్చి బ్రేక్‌ పాయింట్‌ దక్కింది. ఒసాకా కొట్టిన షాట్‌ నెట్‌కు తగిలి అవతలివైపు వెళ్లగా బ్రేడీ రిటర్న్‌ షాట్‌ ఆడింది. అయితే ఆమె కొట్టిన షాట్‌ బయటకు వెళ్లిందని లైన్‌ అంపైర్‌ ప్రకటించింది. అయితే టీవీ రీప్లేలో బ్రేడీ షాట్‌ లైన్‌ అంచును తాకిందని కనిపించింది. కానీ బ్రేడీ టీవీ రీప్లే అడగకపోవడంతో గేమ్‌ ఒసాకా వశమైంది. ఆ తర్వాత ఒసాకా తన సర్వీస్‌లను నిలబెట్టుకొని బ్రేడీ ఓటమిని ఖాయం చేసింది.

పావిచ్‌–సోరెస్‌ జంటకు డబుల్స్‌ టైటిల్‌ 
పురుషుల డబుల్స్‌ విభాగంలో అన్‌సీడెడ్‌ ద్వయం మ్యాట్‌ పావిచ్‌ (క్రొయేషియా)–బ్రూనో సొరెస్‌ (బ్రెజిల్‌) టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో పావిచ్‌–సోరెస్‌ జంట 7–5, 6–3తో వెస్లీ కూలాఫ్‌ (నెదర్లాండ్స్‌)–నికోలా మెక్‌టిక్‌ (క్రొయేషియా) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన పావిచ్‌–సోరెస్‌ జంటకు 4,00,000 డాలర్లు ప్రైజ్‌మనీగా (రూ. 2 కోట్ల 93 లక్షలు) లభించాయి.

మరిన్ని వార్తలు