French Open 2021:సెరెనా శ్రమించి...

3 Jun, 2021 05:05 IST|Sakshi

మూడో రౌండ్‌లోకి అమెరికా స్టార్‌

పదో సీడ్‌ బెన్‌చిచ్‌ పరాజయం  

పారిస్‌: కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌పై గురి పెట్టిన అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ ఆ దిశగా మరో అడుగు వేసింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్‌ సెరెనా మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన రెండో రౌండ్‌లో సెరెనా 2 గంటల 3 నిమిషాల్లో 6–4, 5–7, 6–1తో ప్రపంచ 174వ ర్యాంకర్‌ మిహేలా బుజర్‌నెస్కూ (రొమేనియా)పై కష్టపడి గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఐదు ఏస్‌లు సంధించిన సెరెనా, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసింది. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. మరోవైపు పదో సీడ్‌ బెన్‌చిచ్‌ (స్విట్జర్లాండ్‌) రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. బెన్‌చిచ్‌ 2–6, 2–6తో కసత్‌కినా (రష్యా) చేతిలో ఓడిపోయింది.

జొకోవిచ్‌ శుభారంభం
పురుషుల సింగిల్స్‌లో వరల్డ్‌ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ తొలి రౌండ్‌లో 6–2, 6–4, 6–2తో సాండ్‌గ్రెన్‌ (అమెరికా)పై నెగ్గి శుభారంభం చేశాడు. ఐదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌), ఆరో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. రెండో రౌండ్‌లో సిట్సిపాస్‌ 6–3, 6–4, 6–3తో మార్టినెజ్‌ (స్పెయిన్‌)పై, జ్వెరెవ్‌ 7–6 (7/4), 6–3, 7–6 (7/1)తో గెలిచారు. 11వ సీడ్‌ బాటిస్టా అగుట్‌ (స్పెయిన్‌) 3–6, 6–2, 3–6, 2–6తో లాక్సోనెన్‌ (స్విట్జర్లాండ్‌) చేతిలో ఓడిపోయాడు.

పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో దివిజ్‌ శరణ్‌ (భారత్‌)–డెల్‌బోనిస్‌ (అర్జెంటీనా) 6–3, 6–7 (11/13), 4–6తో డిమినార్‌–రూడ్‌ (ఆస్ట్రేలియా) చేతిలో... మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో అంకిత రైనా (భారత్‌)–లౌరెన్‌ (అమెరికా) 4–6, 4–6తో హర్డెక (చెక్‌ రిపబ్లిక్‌)–సిగెముండ్‌ (జర్మనీ) చేతిలో ఓడిపోయారు.  

>
మరిన్ని వార్తలు