సెరెనాకు కష్టమే

6 Feb, 2021 05:39 IST|Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో క్లిష్టమైన ‘డ్రా’

మెల్‌బోర్న్‌: మహిళల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ గెలిచిన ప్లేయర్‌గా మార్గరెట్‌ కోర్ట్‌ (24 టైటిల్స్‌) పేరిట ఉన్న రికార్డును సమం చేసేందుకు అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌ మరోసారి ప్రయత్నించనుంది. సోమవారం మొదలయ్యే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సెరెనాకు క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది. కెరీర్‌లో 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన 39 ఏళ్ల సెరెనా తొలి రౌండ్‌లో లౌరా సిగెముండ్‌ (జర్మనీ)తో ఆడనుంది. సెరెనా ప్రయాణం సాఫీగా సాగితే ఆమెకు మూడో రౌండ్‌లో 24వ సీడ్‌ అలీసన్‌ రిస్కీ (అమెరికా) ఎదురవుతుంది. ఈ అడ్డంకిని దాటితే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఏడో సీడ్‌ సబలెంకా (బెలారస్‌)తో సెరెనా ఆడే చాన్స్‌ ఉంది. సెరెనా క్వార్టర్‌ ఫైనల్‌ చేరితే అక్కడ ఆమెకు ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్స్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా) లేదా స్వియాటెక్‌ (పోలాండ్‌) ఎదురుపడే అవకాశముంది. దీనిని అధిగమిస్తే సెమీఫైనల్లో మూడో సీడ్‌ నయోమి ఒసాకా (జపాన్‌) రూపంలో సెరెనాకు కఠిన ప్రత్యర్థి ఎదురుకావొచ్చు. మరో పార్శ్వం నుంచి టాప్‌ సీడ్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ఫైనల్‌ చేరుకోవచ్చు.
 

>
మరిన్ని వార్తలు