అక్క ఫై చెల్లిదే ఫైచెయ్యి...

15 Aug, 2020 02:48 IST|Sakshi

వీనస్‌ఫై నెగ్గిన సెరెనా

లెక్సింగ్టన్‌ (అమెరికా): కరోనా విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లో టైటిల్‌ దిశగా అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ మరో అడుగు వేసింది. కెంటకీలో జరుగుతున్న టాప్‌ సీడ్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ టోర్నమెంట్‌లో సెరెనా క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సెరెనా 3–6, 6–3, 6–4తో తన అక్క వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా)పై గెలిచింది. తమ 22 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ముఖాముఖిగా తలపడటం ఇది 31వసారి కాగా వీనస్‌పై సెరెనా గెలవడం ఇది 19వ సారి కావడం విశేషం. 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 14 ఏస్‌లు సంధించింది.

తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి వీనస్‌ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసింది. నిర్ణాయక మూడో సెట్‌లో ఒకదశలో సెరెనా 2–4తో వెనుకబడినా... ఒక్కసారిగా విజృంభించి వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు 40 ఏళ్ల వీనస్‌ ఈ మ్యాచ్‌లో 11 డబుల్‌ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకుంది.  క్వార్టర్‌ ఫైనల్లో అమెరికాకే చెందిన షెల్బీ రోజర్స్‌తో సెరెనా ఆడుతుంది. ‘నా కెరీర్‌లో తొలి టైటిల్‌ సాధించేందుకు ఇక్కడకు రాలేదు. విరామం తర్వాత నా ఆటతీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి, నా ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి వచ్చాను’ అని 38 ఏళ్ల సెరెనా వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు