క్రికెట్‌ ఆస్ట్రేలియాకు షాక్‌.. విదేశీ సిరీస్‌ల నుంచి ఏడుగురు ఔట్‌

17 Jun, 2021 18:11 IST|Sakshi

సిడ్నీ: ఐపీఎల్‌ 2021లో ఆడిన అగ్రశ్రేణి ఆసీస్‌ క్రికెటర్లు వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ పర్యటనల నుంచి వైదొలుగుతూ, క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)కు షాకిచ్చారు. ఈ ఏడాది చివర్లో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని, సీఏ ఈ రెండు విదేశీ పర్యటనలను ఖరారు చేయగా, ఆసీస్‌ స్టార్‌ ఆటగాళ్లు మాత్రం నిరాసక్తత కనబర్చారు . కొందరు వ్యక్తిగత కారణాలు సాకుగా చూపిస్తూ, మరికొందరు గాయాల నుంచి కోలుకోలేదని నివేదికలు సమర్పిస్తూ ఈ రెండు విదేశీ పర్యటనలకు డుమ్మా కొట్టారు.

సీనియర్లు డేవిడ్‌ వార్నర్‌, పాట్‌ కమిన్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టాయినీస్‌లు వ్యక్తిగత కారణాల వల్ల తమను ఈ టూర్‌ కోసం పరిగణించవద్దని విజ్ఞప్తి చేయగా, స్టీవ్‌ స్మిత్‌,  జే రిచర్డ్‌సన్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, డేనియల్‌ సామ్స్‌లు ఐపీఎల్‌ సమయంలో తగిలిన గాయాల కారణంగా జట్టు నుంచి తప్పించమని అభ్యర్ధించారు. టీ20 ప్రపంచ కప్‌ అక్టోబర్‌ నెలలో ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆటగాళ్లు ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చూపుతూ జట్టుకు దూరంగా ఉండటం సీఏను కలవరపెడుతుంది.

ఇదిలా ఉంటే, విండీస్‌, బంగ్లా టూర్‌ కోసం 18 మందితో కూడిన జట్టును క్రికెట్‌ ఆస్ట్రేలియా బుధవారం ప్రకటించింది. ఆసీస్‌ జట్టు జూలై 9 నుంచి 24 మధ్య విండీస్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడాల్సి ఉండగా, బంగ్లాదేశ్‌లో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌పై ఇంకా స్పష్టతరావాల్సి ఉంది.
చదవండి: KL RAHUL: ప్రియసఖితో తొలిసారి.. గతంలో విరుష్క జోడీ కూడా ఇలానే

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు