Lionel Messi: ఏడుసార్లు గెలిచి చరిత్రకెక్కాడు.. ఈసారి మాత్రం అవమానం!

13 Aug, 2022 12:42 IST|Sakshi

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ తొలిసారి ప్రతిష్టాత్మక ''బాలన్‌ డీ ఓర్‌'' అవార్డుకు నామినేట్‌ కాలేకపోయాడు. అవార్డుకు సంబంధించి 30 మంది జాబితాను ప్రకటించగా.. మెస్సీ నామినేషన్‌కు కూడా అర్హత సాధించకపోవడం ఇదే తొలిసారి. మెస్సీ బార్సిలోనా నుంచి పారిస్‌ సెయింట్‌-జెర్మన్‌(పీఎస్‌జీ) తరపున మొదటి సీజన్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఏడుసార్లు అవార్డు అందుకున్న మెస్సీ ప్రాంచైజీ మారిన ఏడాది వ్యవధిలోనే బాలన్‌ డీ ఓర్‌కు నామినేట్‌ కాకపోవడం ఆసక్తి కలిగించింది.

ఇక మెస్సీతో పాటు సహచర పీఎస్‌జీ ఆటగాడు.. బ్రెజిల్‌ స్టార్‌ నెయమర్‌ కూడా నామినేట్‌ అవడంలో విఫలమయ్యాడు. కాగా ప్రతిష్టాత్మక​ బాలిన్‌ డీ ఓర్‌ అవార్డుకు మొత్తం 30 మంది నామినేట్‌ కాగా.. వారిలో ఐదుసార్లు అవార్డు విజేత క్రిస్టియానో రొనాల్డో సహా మహ్మద​ సాలా, రాబర్ట్‌ లెవాండోస్కీ, కిలియన్‌ బేపీ, ఎర్లింగ్‌ హాలండ్‌, కరీమ్‌ బెంజెమా, సాదియో మానే, కెవిన్‌ డిబ్రుయోన్‌, హారీ కేన్‌ తదితరులు ఉన్నారు. కాగా అక్టోబర్‌ 17న ప్రతిష్టాత్మక బాలన్‌ డీ ఓర్‌ అవార్డు విజేతను ప్రకటించనున్నారు. 

కాగా గతేడాది పొలాండ్‌ స్ట్రైకర్‌ రాబర్ట్‌ లెవాండోస్కీతో టగ్‌ ఆఫ్‌ ఫైట్‌ ఎదురయినప్పటికి తొలి స్థానంలో నిలిచి ఏడోసారి అవార్డును ఎగురేసుకుపోయాడు. ఈసారి మాత్రం పీఎస్‌జీకి ఆడుతూ మెస్సీ తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. కాగా 2005 నుంచి చూసుకుంటే మెస్సీ ఇప్పటివరకు ఏడుసార్లు బాలన్‌ డీ ఓర్‌ అవార్డును దక్కించుకొని చరిత్ర సృష్టించాడు.

2005 నుంచి వరుసగా నామినేట్‌ అవుతూ వచ్చిన మెస్సీ.. 2007, 2009, 2010, 2011, 2012, 2019, 2021లో ఏడుసార్లు అవార్డును గెలవడం విశేషం. ఇక 1956 నుంచి ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ మ్యాగజైన్‌.. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి బాలన్‌ డీ ఓర్‌ పేరిట పురస్కారం ఇస్తూ వస్తుంది. ఇక 2018 నుంచి మహిళల విభాగంలోనూ ఈ అవార్డు అందిస్తుంది.

చదవండి: The Great Khali: 'ది గ్రేట్‌ ఖలీ' కన్నీటి పర్యంతం.. అంతుచిక్కని ప్రశ్నలా!

Ashes Series:139 ఏళ్ల యాషెస్‌ చరిత్రకు తొలిసారి దెబ్బ పడనుందా!

మరిన్ని వార్తలు